Niazamabad: రోహింగ్యాలకు భారత పాస్‌పోర్టులు.. డబ్బుల కోసం పోలీసుల కక్కుర్తి

ప్రతీకాత్మక చిత్రం

బోధన్ పట్టణంలోని ఒక ఇంటి చిరునామాతో మొత్తం 32 పాస్‌పోర్టు జారీ అయినట్లు తెలిసి అధికారులు ఖంగుతిన్నారు. రోహింగ్యాలకు ఎస్సై మల్లేశ్వరరావు, ఏఎస్సై అనిల్ పూర్తిగా సహకరించిన‌ట్లు స్పెషల్ టీమ్ అధికారులు నిర్ధారించారు.

  • Share this:
    తెలంగాణలో నివసిస్తున్న బంగ్లాదేశీయులకు అక్రమంగా భారత్ పాస్‌పోర్టులు అందాయి. ఒకే ఇంటి అడ్రస్‌తో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు మంజూరు చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఈ రోహింగ్యాల పాస్‌పోర్ట్‌ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఒకే ఇంటి నంబ‌ర్‌తో ఇంత మందికి ఎలా పాస్ పోర్టు మంజూరు చేశారనే దానిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. వారికి స‌హ‌క‌రించార‌ని ఇద్దరు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్ప‌టికే 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తీగలాగితే డొంక క‌దిలిన‌ట్లుగా రోహింగ్యాల పాస్ పోర్ట్ విష‌యంలో కొత్త కొత్త విష‌యాలు బ‌య‌టకు వ‌స్తున్నాయి.

    నిజామాబాద్ జిల్లా బోధన్ ప‌ట్ట‌ణంలో పాస్ పోర్టులు పొందిన రోహింగ్యాలు 17 రోజుల క్రితం దుబాయి వెళ్లేందుకు హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్క‌డ అధికారుల‌కు అనుమానం వ‌చ్చి లోతుగా విచారించారు. దీంతో వారి బండారం బ‌య‌ట ప‌డింది. హైద‌రాబాద్ నుంచి స్పెషల్ టీమ్ బోధన్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో ఒకే ఇంటి నంబ‌ర్‌తో పాస్‌పోర్టులు పొందిన ఆరుగురిని, ముగ్గురు మీ సేవ కేంద్రం నిర్వాహకులను, మధ్యవర్తిగా ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేటలో పనిచేస్తున్న ఎస్సై మల్లేశ్వరరావు, బోధన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న అనిల్ రోహింగ్యాలకు సహకరించారని గుర్తించి.. వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల విడుదల చేశారు. వీరిని హైదరాబాద్‌కు తీసుకెళ్ళి తొమ్మిది రోజులపాటు విచారణ చేశారు.

    బోధన్ పట్టణంలోని ఒక ఇంటి చిరునామాతో మొత్తం 32 పాస్‌పోర్టు జారీ అయినట్లు తెలిసి అధికారులు ఖంగుతిన్నారు. రోహింగ్యాలకు ఎస్సై మల్లేశ్వరరావు, ఏఎస్సై అనిల్ పూర్తిగా సహకరించిన‌ట్లు స్పెషల్ టీమ్ అధికారులు నిర్ధారించారు. 2014 నుంచి ఏప్రిల్ 2019 వరకు బోద‌న్ ఎస్బీలో మల్లేశ్వరరావు పనిచేశారు. ఆయన హయాంలో సుమారు 40 పాస్ పోర్టులు మంజూరు చేసిన‌ట్లు తేలింది. ఆ తర్వాత బాధ్యత తీసుకున్న అనిల్ ద్వారా 30 వ‌ర‌కు పాస్ పోర్టులు మంజూరు అయినట్లు సమాచారం. పాస్ పోర్టు జారిచేసేందుకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టిన‌ట్టుగా స్పెషల్ టీం విచార‌ణ‌లో తేలింది. దీంతో మ‌ల్లేశ్వ‌రరావు, అనిల్ ఆస్తుల‌పై ర‌హ‌స్యంగా విచారిస్తున్నారు అధికారులు.

    ఇద్ద‌రు రోహింగ్యాలు 17 రోజుల కిందట విమానాశ్ర‌మంలో అధికారులకు చిక్కారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆస‌లు విష‌యం బయటకు వచ్చింది. ఈ కేసులో ఆరుగురు రోహింగ్యాలు, బోధన్‌కు చెందిన ఒకరు, జిల్లా కేంద్రంలో ఇద్దరు, మీసేవ నిర్వాహకులు నిజామాబాద్ న‌గ‌రానికి చెందిన ఓ వ్యక్తిని జైలుకు పంపారు. పాస్ పోర్టు పొందేందుకు ఇచ్చిన ముడుపుల విష‌యన్ని రోహింగ్యాలు పోలీసుల విచార‌ణ‌లో చెప్పారు. ఇదే విషయ‌పై నిజామాబాద్ ఎంపి అరవింద్ స్పందించారు. సీపీ కార్తీకేయ వెంట‌నే రాజీనామా చేయ‌ల‌ని డిమాండ్ చేసారు. సీపీ వ్య‌వ‌హ‌ర శైలిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దీనిపై ఎన్ఐఏ విచారణ చేయాలని ఆయన కోరారు.
    Published by:Shiva Kumar Addula
    First published: