news18-telugu
Updated: November 11, 2020, 11:33 PM IST
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
దుబ్బాక ఉప ఎన్నికల తరువాత టీపీసీసీ చీఫ్‌ను మార్చాలనే డిమాండ్ మరోసారి జోరందుకుంది. దీంతో ఈ పదవి కోసం పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ క్రమంలోనే బీసీలకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని వి.హనుమంతరావు వంటి నేతలు డిమాండ్ చేయడం.. దానికి రేవంత్ రెడ్డి అదే సభలో కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతు పొలికేక సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న వి. హనుమంతరావు.. తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవిని బడుగు బలహీన వర్గాల వారికీ ఇవ్వాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లగలుగుతుందని వ్యాఖ్యానించారు.
అయితే వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సభలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. రేవంత్ కు అనుకూలంగా సభలో నినాదాలు చేస్తున్నా, వీహెచ్ వెనక్కి తగ్గలేదు. బడుగు బలహీన వర్గాలవారికి అధ్యక్ష పదవిని ఇస్తేనే రాష్ట్రంలో పార్టీ బతికి బట్టకడుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వొద్దని, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వీహెచ్ వ్యాఖ్యానించారు.
అయితే ఇదే సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... వచ్చే ఎన్నికలలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు కేసీఆర్, కేటీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు అమ్ముడుపోతున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. అలాంటి వారిని ఏరివేయాలని అన్నారు. అంతేకాదు డిపాజిట్లు పోయిన నాయకుల పెత్తనం కాంగ్రెస్‌లో ఉండదని కాంగ్రెస్ నాయకత్వం తెలిపిందని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేసి పరోక్షంగా వీహెచ్ వంటి సీనియర్లపై సెటైర్లు వేశారనే టాక్ వినిపిస్తోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
November 11, 2020, 9:51 PM IST