కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావు. ఇక అందరం కలిసి పని చేస్తే కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తాయన్నారు. అంతేకాదు పొత్తులపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కానీ ఎన్నికల తరువాత కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీతో పోయే పరిస్థితి లేదు. ఇక ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు హనుమంతరావు, మల్లు రవి, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యలపై స్పందించారు.
'కోమటిరెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. పార్టీకి నష్టం కలిగిస్తే అధిష్టానం చూసుకుంటుంది. ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఏం మాట్లాడారో తెలీదు. ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసినా..పార్టీకి సంబంధించి వ్యాఖ్యలు చేసిన అది పార్టీ హైకమాండ్ పరిధిలోనే ఉంటుందన్నారు. పీసీసీ అధ్యక్షునిగా హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానని' రేవంత్ తెలిపారు.
కోమటిరెడ్డి ఏమన్నారంటే?
బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలు. వచ్చే ఎన్నికల్లో ఎవరికీ కూడా 60 సీట్లు రావు. కేసీఆర్ కాంగ్రెస్ తో నడవక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేది హంగ్ మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ గాడిలో పడుతుంది. కొత్తైనా..పాతైనా కూడా గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. అయితే తాము ఒంటరిగానే పోరాడుతాం..కానీ ఎన్నికల తరువాత పొత్తులు తప్పవన్నారు. ఇక పాదయాత్రపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 1 నుంచి పాదయాత్ర లేదా బైక్ యాత్ర చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చెప్పుకొచ్చారు.
ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) ఆసక్తికర సమాధానం చెప్పారు. కాంగ్రెస్ గాడిలో పడుతుంది. ఎన్నికలకు 3,4 నెలలు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా గెలవదు. అలాగని ఏ పార్టీకి 60 సీట్లు రావన్నారు. కాంగ్రెస్ బీజేపీతో, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేవు. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని అన్నారు. వారికీ, మాకు ప్రత్యామ్నాయ మార్గం లేదని అన్నారు. అయితే ఎన్నికల వరకు ఒంటరిగానే పోరాడుతాం. కానీ ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి పొత్తులు తప్పవని ఆయన జోస్యం చెప్పారు.
కాగా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఇక ఇప్పటికే కోమటిరెడ్డి వ్యాఖ్యల గురించి తెలుసుకున్న థాక్రే రేపు ఆయనతో సమావేశం కానున్నారు. మరి ఈ సమావేశంలో థాక్రే కోమటిరెడ్డికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Komatireddy venkat reddy, Mp revanthreddy, Telangana