REVANTH REDDY LED TELANGANA CONGRESS DECIDED TO CONTEST LOCAL BODY MLC ELECTIONS HERE IS CANDIDATES LIST TPCC MKS
తొడగొట్టిన తెలంగాణ కాంగ్రెస్ : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రేవంత్ రెడ్డి సేన -నాలుగు జిల్లాల్లో అభ్యర్థులు వీరే
ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖమ్మం -నాగేశ్వరరావు, మెదక్-నిర్మల జగ్గారెడ్డి, నిజామాబాద్-మహేష్ కుమార్‌గౌడ్, వరంగల్-వేం వాసుదేవరెడ్డిలను పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా జిల్లాల్లో పోటీ నిర్ణయం స్థానిక డీసీసీలకే వదిలేశారు.
ఇటీవలే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో దాదాపు మట్టికరిచిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తొడగొట్టింది. సుదీర్ఘ సస్పెన్స్ కు, శషభిషలకు తెరదించుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) బరిలోకి దిగుతున్నట్లు పార్టీ ప్రకటించింది. హుజూరాబాద్ ఓటమి, అంతముందు జరిగిన జీహెచ్ఎంసీ, దానికంటే ముందు దుబ్బాక.. ఇలా అన్ని చోట్లా వైఫల్యాలే ఎదురవుతోన్న క్రమంలో సరైన బలం లేకుండా బరిలోకి దిగి ఓడిపోయి పరువుపోగొట్టుకోవడం ఎందుకనే భావనను పార్టీలోనేని నేతలందరూ వ్యక్తపర్చారు. అదే సమయంలో ఏ కొద్దిగా ఉన్న అవకాశాలను కూడా వదలుకోరాదనీ తీర్మానించుకున్నారు. రోజుల తరబడి మంతనాల తర్వాత ఎట్టకేలకు ఎమ్మెల్సీ బరిలో నిలవాలని తెలంగాణ కాంగ్రెస్ డిసైడైంది. కానీ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. అయితే, మొత్తం 12 ఎమ్మెల్సీలకూ పోటీ జరుగనుండగా, కాంగ్రెస్ మాత్రం తనకు ఏ కొంచెమో అవకాశమున్న నాలుగు జిల్లాల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా, సోమవారం రాత్రి కాంగ్రెస్ తన అభ్యర్థులను ఖరారు చేసింది. జిల్లాల వారీగా పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖమ్మం -నాగేశ్వరరావు, మెదక్-నిర్మల జగ్గారెడ్డి, నిజామాబాద్-మహేష్ కుమార్‌గౌడ్, వరంగల్-వేం వాసుదేవరెడ్డిలను పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో పోటీ చేయాల వద్దా? పోటీ చేస్తే అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన నిర్ణయాన్ని.. ఆయా జిల్లాల డీసీసీలకే అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు,
అధికార టీఆర్ఎస్ దూకుడుగా వెళుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఏకగ్రీవంకాగా, స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ అభ్యర్థులనూ ఖరారు చేశారు. కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపుతారనే ఊహాగానాలకు తెరదించుతూ ఆమెను నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగానే మరోసారి అవకాశమిచ్చారు సీఎం కేసీఆర్. మిగతా జిల్లాల్లో అభ్యర్థులుగా, మహబూబ్‌నగర్- సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఖమ్మం- తాత మధు, ఆదిలాబాద్- దండే విఠల్, రంగారెడ్డి- శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ- ఎంసీ కోటిరెడ్డి, మెదక్- డాక్టర్ యాదవరెడ్డి, కరీంనగర్- ఎల్.రమణ, భాను ప్రసాద్‌రావు ఉన్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే నామినేషన్లు వేశారు. కవిత, మిగిలినవాళ్లు మంగళవారం నామినేషన్లు వేస్తారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.