కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు అంత తేలికగా జరగవు. ఈ విషయం ఆ పార్టీ గురించి తెలిసిన వాళ్లందరికీ బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తులు జరుగుతుంటాయి. తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్ ఇదే రకమైన సంప్రదింపులు జరిపింది. అయితే నిర్ణయం తీసుకునే సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో దిగబోతున్న జానారెడ్డి అధిష్టానానికి సూచన చేయడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేంతవరకు మళ్లీ టీపీసీసీ చీఫ్ ఎంపిక గురించి కాంగ్రెస్ నేతలెవరూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇది టీపీసీసీ చీఫ్ లేదా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించి దాదాపు దగ్గరవరకు వెళ్లిన ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి, ఆయన అనుచరులకు నిరాశ కలిగించింది. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయిన తరువాతైనా.. రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌లో కోరుకున్న పదవి దక్కుతుందా అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఇందుకు అసలు కారణం జాతీయస్థాయిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జూన్‌లో ఎన్నికలు జరగనుండటమే. జూన్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో అప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని కానీ లేక ఇతర కీలక పదవులకు నేతలను కానీ ఎంపిక చేయబోరని దాదాపుగా స్పష్టమైంది. తెలంగాణలో త్వరలోనే నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంటుందని కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగి.. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న తరువాతే మళ్లీ ఈ అంశంపై దృష్టి పెట్టొచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు అప్పటి పరిస్థితిని బట్టి మళ్లీ టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం మళ్లీ సంప్రదింపులు, కసరత్తు మొదలుపెట్టే అవకాశం లేకపోలేదనే వాదన కూడా కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పదవి ఆశిస్తున్న రేవంత్ రెడ్డికి మరికొన్ని నెలల వెయిటింగ్ తప్పేలా లేదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:January 27, 2021, 21:23 IST