Revanth Reddy: రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు.. కాంగ్రెస్ కు ప్లస్సా..? మైనస్సా.?

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి.. ఇలా రేవంత్ తో పాటు పీసీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య కాంగ్రెస్ లో చాంతాడంత ఉంది. మరి వాళ్లందరినీ కాదని రేవంత్ కు పార్టీ పగ్గాలను అప్పగిస్తే కాంగ్రెస్ కు ప్లస్సా..? మైనస్సా..? కాంగ్రెస్ కు పునర్వైభవం లభిస్తుందా..? అన్న దానిపై ప్రత్యేక కథనం.

  • Share this:
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనే పేరు హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయనకే పీసీసీ అధ్యక్ష పదవి ఖరారయిందనే వార్తలు అటు కాంగ్రెస్ లోనూ, ఇటు తెలంగాణ రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి పార్టీ పగ్గాలు ఇచ్చినా పర్లేదన్నది కాంగ్రెస్ లో పీసీసీ పదవిని ఆశిస్తున్న మెజార్టీ నేతల డిమాండ్. రేవంత్ కు పగ్గాలిస్తే కాంగ్రెస్ భూ స్థాపితం ఖాయమని వీహెచ్ లాంటి కురువృద్ధులు కూడా ఆవేదన చెందుతున్నారు. ‘నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఎలా ఇస్తారు? ఎన్నో ఏళ్లుగా మేం కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నాం. కోమటిరెడ్డికి ఎందుకు ఇవ్వరు.? జగ్గారెడ్డికి ఎందుకు ఇవ్వరు.? శ్రీధర్ బాబుకి ఎందుకు ఇవ్వరు.? ఈ నకిలీ రెడ్డి అయిన రేవంత్ కు పగ్గాలు ఎలా ఇస్తారు.? ఈయన చంద్రబాబు మనిషి అని కేసీఆర్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు ఎవరైనా ఓట్లేస్తారా?’ అని ప్రెస్ మీట్ పెట్టి మరీ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి.. ఇలా రేవంత్ తో పాటు పీసీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య కాంగ్రెస్ లో చాంతాడంత ఉంది. మరి వాళ్లందరినీ కాదని రేవంత్ కు పార్టీ పగ్గాలను అప్పగిస్తే కాంగ్రెస్ కు ప్లస్సా..? మైనస్సా..? కాంగ్రెస్ కు పునర్వైభవం లభిస్తుందా..? అన్న దానిపై ప్రత్యేక కథనం.

కాంగ్రెస్ లో అలాంటి లీడర్ ఎవరు..?
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఇవీ తెలంగాణలో ప్రధాన పార్టీలు. గులాబీ దళపతి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు టీఆర్ఎస్ కు స్టార్ క్యాంపెయినర్లు. ఇటు బీజేపీకి బండి సంజయ్ స్టార్ క్యాంపెయినర్. దూకుడు తత్వం, పదునైన ప్రసంగాలు చేయగలగడం, ప్రత్యర్థులను ఇరుకున పెట్టగలిగేలా మాటల దాడులు చేయడం వీరికి ఉన్న ప్రధాన బలం. మరి కాంగ్రెస్ లో అలాంటి వాళ్లు ఎవరు ఉన్నారు.? అని చూస్తే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ పై కయ్యానికి కాలు దువ్వడంలో రేవంత్ ముందుంటారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కొడంగల్ లో ఎంత రచ్చ జరిగిందో.? రేవంత్ ను ఎలా టార్గెట్ చేశారో.. అందరికీ తెలిసిందే. రేవంత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదన్న ప్రధాన లక్ష్యంతోనే అక్కడ టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. మొత్తానికి ఆ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. అంటే రేవంత్ తన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ చెప్పకనే చెప్పింది. అలాంటి రేవంత్ కాంగ్రెస్ కు పీసీసీ అధ్యక్షుడు అయితే ప్లస్తే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పూర్తి ఆధారాలతో, పక్కా సమాచారంతో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో గత అసెంబ్లీలో రేవంత్ సక్సెస్ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి కనుక వస్తే రేవంత్ కూడా దూకుడును మరింత పెంచాలని యోచిస్తున్నారు. తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని కూడా రేవంత్ ప్రకటించారు. అదే జరిగితే తెలంగాణలో పునర్వైభవం కచ్చితంగా వస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు. ’అటు దుబ్బాకలోనూ, ఇటు జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయాలు జరిగాయి. మీడియా కూడా వారి మధ్యే ప్రధాన పోటీ అన్నట్టుగా సీన్ ను క్రియేట్ చేశాయి. అందుకే కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలయింది. ఆ రెండు పార్టీలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ జనాలను డైవర్ట్ చేశాయి..‘ అని రేవంత్ రెడ్డి ఇటీవల వాపోయిన సంగతి తెలిసిందే.

వాళ్లిద్దరి మాటలే ప్రూఫ్.. రేవంత్ కే పార్టీ పగ్గాలు
నిజానికి రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు ఇస్తున్నామని కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. కానీ కాంగ్రెస్ లోని కొందరు నేతల ప్రవర్తనను పరిశీలిస్తే రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడు కాబోతున్నాడని ఈజీగా అర్థమవుతుంది.. ఎప్పుడూ లేనిది వీహెచ్ మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎవరూ అడగకముందే తాను బీజేపీలోకి వెళ్తానని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కూడా ఒక్క మాట కూడా పీసీసీ అధ్యక్ష పదవి గురించి మాట్లాడటం లేదు. ఢిల్లీకి వెళ్తున్నారు. వస్తున్నారు. కానీ పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న తతంగాలపై మాత్రం నోరు మెదపడం లేదు. సో, ఈ పరిణామాలను గమనిస్తే పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ కే అని ఇట్టే అర్థం అయిపోతుంది.

రేవంత్ కు పగ్గాలిస్తే.. చాల ప్లస్సులు.. ఆ ఒక్కటే మైనస్
‘దూకుడుగా వెళ్తారు. మిగిలిన నేతలను పట్టించుకోరు. ఒంటెత్తు పోకడలు పోతారు‘ అన్నది కాంగ్రెస్ లోని ముఖ్య నేతల ఆరోపణ. దాన్ని కనుక రేవంత్ అధిగమిస్తే, అందరినీ కలుపుకుని పోతే తప్పకుండా కాంగ్రెస్ పునర్వైభవం సాధిస్తుంది. ఇప్పటికీ గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ కు బలం, బలగం ఉంది. కానీ ఆ కార్యకర్తల్లో జోష్ పెంచే బలమైన నాయకుడే కాంగ్రెస్ కు కరువయ్యారు. రేవంత్ కనుక పూర్తి ఫామ్ లోకివస్తే టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే స్థాయిలోకి వస్తుంది. అదే విధంగా రేవంత్ కు పగ్గాలు అప్పజెప్పితే, తెలంగాణలో టీడీపీని ఇప్పటికీ అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలంతా రేవంత్ పైపు మొగ్గుచూపుతారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగయిపోతుంది. నియోజకవర్గానికి ఒక వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు రేవంత్ వైపు మొగ్గు చూపినా అది కాంగ్రెస్ కు అదనపు బలమే అని చెప్పవచ్చు. 2023లో జరగబోయే త్రిముఖ పోరులో ఒక్క ఓటు అయినా ఎంతో ముఖ్యం. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉండి, అటు బీజేపీ విధానాలను నచ్చని తటస్థులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. ఇది అంతిమంగా రేవంత్ కు మరో ప్లస్ పాయింట్ గా మారిపోతుంది. పాదయాత్ర ద్వారా మీడియా ఫోకస్ ను కూడా రేవంత్ తనవైపునకు తిప్పుకుంటారు. సో, ఎటు చూసుకున్నా రేవంత్ కు పగ్గాలిస్తే కాంగ్రెస్ కు ప్లస్సే తప్పితే మైనస్సులు ఎక్కువగా కనిపించడం లేదు. మరి రేవంత్ పై ఉన్న కేసుల సంగతేంటని ప్రశ్నలు కూడా కాంగ్రెస్ అసంతృప్త నేతల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు లేవు.? జనాలు ఈ కేసులను పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేయడం ఎప్పుడో మానేశారు అన్నది నిర్వివాదాంశం. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడం ఇష్టంలేని కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడమొక్కటే ఆ పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు.

రేవంత్ ఫస్ట్ టార్గెట్ టీఆర్ఎస్ కాదు..!
అయితే ఇప్పుడు బీజేపీ రూపంలో రేవంత్ కు ఓ ప్రధానమైన సవాల్ ఎదురొస్తోంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ఇప్పటికే రెండు ఘన విజయాలను సాధించింది. దీన్ని కొనసాగిస్తూ 2023లో తెలంగాణ సీఎం పీఠాన్ని గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ హైజాగ్ చేసింది. ఆ ప్రతిపక్ష స్థానాన్ని తిరిగి తన వద్దకు లాక్కురావడం ప్రస్తుతం రేవంత్ మొట్టమొదటి టార్గెట్. ఆ తర్వాతే టీఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి రేవంత్, బీజేపీ నుంచి బండి సంజయ్ మాటల ధాటికి తట్టుకుని టీఆర్ఎస్ ను మళ్లీ గెలుపు తీరాలకు ఎలా తీసుకువస్తారో వేచి చూడాలి.
Published by:Hasaan Kandula
First published: