జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గుర్తులు తారుమారైన నేపథ్యంలో 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. సెలవును అన్ని కార్యాలయాల అధిపతులు కచ్చితంగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
23 పోలింగ్ కేంద్రాల్లో ఈసీ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుంది. రీపోలింగ్ కోసం 12 మంది మైక్రో అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో మొత్తం 54,502 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 27,811 మంది కాగా... మహిళా ఓటర్ల సంఖ్య 26,688. ఇతరులు ముగ్గురున్నారు. హైదరాబాద్‌లోని 26వ డివిజన్ ఓల్డ్ మలక్ పేటలో సీపీఐ అభ్యర్థి పోటీలో నిలిచారు. అయితే అక్కడ సీపీఐ గుర్తు కంకి కొడవలి గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తు అయిన సుత్తి కొడవలి గుర్తు వచ్చింది. దీన్ని గుర్తించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అక్కడ ఓటింగ్ నిలిపివేశారు. అక్కడ పోలింగ్ రద్దు చేశారు. నేడు ఆ డివిజన్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తంగా 46.60 శాతం పోలింగ్ నమోదైంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.31 శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఇక 2009లో 42.04 శాతం పోలింగ్ రికార్డయింది. అంటే పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోందన్న మాట. ఈసారి పోలింగ్ భారీగా తగ్గిందని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. చివరకు 46.6శాతానికి చేరుకుంది.మొత్తం 150 డివిజన్లలో కంచన్‌బాగ్‌లో అత్యధిక పోలింగ్ నమోదయింది. అక్కడ 70.39శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక అత్యల్పంగా యూసఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదైంది. రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.