హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. మళ్లీ ఎప్పుడో..

తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. మళ్లీ ఎప్పుడో..

తెలంగాణ మ్యాప్

తెలంగాణ మ్యాప్

ఇవాళ రాత్రి 07.30కి ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోద ముద్రవేయనున్నారు.

కొత్త రెవెన్యూ చట్టం..! ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతోంది. వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... ఇప్పటికే వీఆర్వోల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అవినీతి జలగల బారి నుంచి రైతులు బయటపడ్డారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే కొత్త రెవెన్యూ చట్టం ఎలా ఉండబోతోంది? అవినీతి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుందన చర్చ జరుగుతున్న వేళ.. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇవాళ్టి నుంచి ఈ స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.

ఐతే ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజే రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. రేపటి నుంచి మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరు. రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవులను ప్రకటించారు. తదుపరి ఆదేశాల వరకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. రాబోయే రోజుల్లో ఎమ్మార్వోల పరిధిలోనే రిజిస్ట్రేషన్లు చేయించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఐతే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఇవాళ రాత్రి 07.30కి ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోద ముద్రవేయనున్నారు. అనంతరం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి.. కొత్త చట్టాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు