Home /News /telangana /

RED ALERT IN TELANGANA AGENCY AS MAOIST MARTYRS WEEK FROM TODAY SK

రెడ్ అలర్ట్.. యుద్ధ భూమిగా మారిన ఏజెన్సీ.. మావోయిస్టుల కోసం వేట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జులై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ దాకా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలుగా మావోయిస్టులు ప్రకటించారు. ఈమేరకు ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పేరిట ఓ కరపత్రం విడుదలైంది.

  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 ఖమ్మం కరెస్పాండెంట్)
  తెలంగాణ, ఆంధ్ర, చత్తీస్‌ఘడ్‌, ఒడిషా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా చర్యలకు పూనుకున్నాయి. ‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని సబ్‌డివిజన్‌ స్థాయి పోలీసు అధికారుల నేతృత్వంలో సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఏఆర్‌, వివిధ రాష్ట్రాల స్పెషల్‌ పోలీసు బృందాలు కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. మావోయిస్టు యాక్షన్‌ టీంల కోసం తీవ్ర స్థాయిలో సెర్చింగ్‌ నడుస్తోంది. మావోయిస్టులు తమకు ప్రాబల్యం ఉన్న దండకారణ్య ప్రాంతాన్ని గతంలోనే రెడ్‌కారిడార్‌గా ప్రకటించుకున్నారు. జులై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ దాకా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలుగా ప్రకటించారు. ఈమేరకు ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పేరిట ఓ కరపత్రం విడుదలైంది.

  మావోయిస్టుల ప్రకటనతో పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్‌ అయ్యారు. సరిహద్దు ప్రాంతాలలోని అన్ని రవాణా మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా భద్రతను పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు సమీపంలో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం, అలాగే అశ్వాపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాంతాలలో బలగాలను మోహరించారు. అధికార పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులకు తమకు తెలియకుండా ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటనలు చేయొద్దంటూ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో దాదాపు అన్ని స్థాయుల్లోని నేతలను అలర్ట్‌ చేశారు. గత వారంలో చర్ల మండలంలో రోడ్డు నిర్మాణం కోసం ఉద్దేశించిన రోలర్‌, ట్రాక్టర్లను మావోయిస్టులు దగ్ధం చేయడంతో పోలీసు అధికారులు ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ లాంటి వాటి నిర్మాణంపై మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ప్రతికూల ప్రభావం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దీన్లో భాగంగానే గత వారంలో సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సహా సంబంధిత ఉన్నతాధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని మదింపు చేశారు.

  గడచిన ఆరేడేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం కోవిద్‌-19 కరోనా వైరస్‌ లాంటి క్రైసిస్‌లో ఉండగా మావోయిస్టులు ఒక్కసారిగా చత్తీసఘడ్‌ నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్వపు ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో, అటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి ఏజెన్సీ ఏరియాలో మావోయిస్టు యాక్షన్‌ టీంల కదలికలు కనిపించాయి. రెండు చోట్ల ఎదురుకాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. దీనికితోడు రాష్ట్ర, జిల్లా, డివిజన్‌, ఏరియా కమిటీలను కూడా మావోయిస్టు పార్టీ చాలా కాలం తర్వాత ప్రకటించింది. ఇలా తమ ప్రాబల్యాన్ని మళ్లీ సాధించాలన్న లక్ష్యంతో మావోయిస్టులు బృందాలుగా వచ్చినట్టు సమాచారం. పోలీసులు గడచిన కొన్నేళ్లుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సబ్‌డివిజన్‌ స్థాయి పోలీసు అధికారి పోస్టులలో ఐపీఎస్‌లను నియమిస్తోంది. భద్రాచలం, మణుగూరులలో ప్రస్తుతం ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను నియమించారు. దీనికి తోడు కొత్తగూడెం కేంద్రంగా ప్రత్యేకంగా ఓఎస్డీ యూనిట్‌ నడుస్తోంది. మావోయిస్టుల ప్రాబల్య నిరోధానికి సంబంధించిన అన్ని వ్యూహాలు, ఎత్తుగడలను ఈ ఓఎస్డీ కార్యాలయం పర్యవేక్షిస్తుంటుంది. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటుంటారు.

  ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీగా ఉన్న రమణారెడ్డికి ఎక్స్రీమిస్ట్‌ ఎఫైర్స్‌లో మంచి పట్టుంది. కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ నేతృత్వంలో ఈ ముగ్గురు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మావోయిస్టు కదలికలను కంట్రోల్‌ చేస్తూ వస్తున్నారు. పోయిన వారంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల ఘటన అనంతరం డీజీపీ పర్యటించడం, రోజుల తరబడి కూంబింగ్‌ కొనసాగుతుండడంతో మావోయిస్టులకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టులు అలికిడి కనిపిస్తోందని, వారికి ఎవరూ భయపడాల్సిన పనిలేదని, వారికి ఎవరూ చందాలు ఇవ్వొద్దని ఆయన మీడియాతో చెప్పారు. దీంతో వెంటనే మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట ఓ లేఖ విడుదలైంది. డీజీపీ వ్యాఖ్యలను కౌంటర్‌ చేస్తూ లేఖతో బాటుగా ఓ ఆడియోను కూడా విడుదల చేశారు. దీనికి కొనసాగింపుగా అన్నట్టు మూడు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ కూడా వరుసగా మావోయిస్టులు, వారి వైఖరి, వసూళ్లు తదితర కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై విమర్శలు చేస్తూ మీడియాకు నోట్‌ రిలీజ్‌ చేశారు. ప్రతిగా జగన్‌ లేఖలు, తాజాగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిస్తూ ఆజాద్‌ లేఖ వెలుగుచూసింది. దీంతో ఐఎపీఎస్‌ అధికారుల స్వయం పర్యవేక్షణలో కూంబింగ్‌ ముమ్మరం అయింది. ప్రస్తుతం ఏజెన్సీ ఏరియా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

  2004 అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం క్రమంగా బలహీన పడుతూ వచ్చిన ఉద్యమం, ఒకదశలో కనుమరుగైందనే చెప్పొచ్చు. దీంతో ఇక్కడ పూర్వ వైభవాన్ని చాటడానికి మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. వెంటనే కమిటీలను ప్రకటించింది. యాక్ఝన్‌ టీంలను సిద్ధం చేసింద. గోదావరి దాటింది. అటు ఆదిలాబాద్‌ నుంచి మొదలు పెట్టి కొమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలతో బాటుగా, ఏపీలోని విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీ ఏరియాలపై పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ‌అయితే వారి వ్యూహం ఏంటన్న దానిపై ఎస్‌ఐబీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. మావోయిస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఆయా జిల్లాలకు సూచనలు ఇస్తూ వస్తోంది. ఈనెల 16వ తేదీన భద్రాద్రి జిల్లా కరకగూడెం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి ప్రాంతాల్లో ఒకేరోజు రెండు ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో మళ్లీ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ ఘటనలో తప్పించుకున్న 15 మంది మావోయస్టుల కోసం ఇప్పటికీ సెర్చ్‌ పార్టీలు విపరీతంగా కూంబింగ్‌ చేస్తున్నాయి. తాజాగా ఏవోబీలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందడం, నిన్న తెలంగాణ సరిహద్దుల్లోనే ఉన్న చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా కరియమేట అటవీ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేసి ఒక జవానును చంపారు. ఫలితంగా యుద్ధభూమిగా మారిన ఏజెన్సీలో ఎప్పుడు ఏంజరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Maoist, Maoists, Telangana, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు