హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: నల్లగొండలో నిమ్మ రైతుకు అపార నష్టం.. ఈ ఏడాది సగానికి తగ్గిన దిగుబడి.. కారణాలివే..

Nalgonda: నల్లగొండలో నిమ్మ రైతుకు అపార నష్టం.. ఈ ఏడాది సగానికి తగ్గిన దిగుబడి.. కారణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నల్గొండలో నిమ్మ మార్కెట్‌కు గతేడాది ఏప్రిల్, మే నెలల్లో రోజుకు పది వేల బస్తాల నిమ్మకాయలు రాగా, ఈ ఏడాది మూడు వేలకు మించి బస్తాలు మార్కెట్‌కు రాలేదు. దిగుబడి అంతగా లేదు. ఎందుకంటే..?

(Nagaraju, News 18, Nalgonda)

మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పండే 90 శాతం నిమ్మ (Lemon).. ఒక్క ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాలోనే సాగవుతోంది. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు నిమ్మ ఎగుమతి జరుగుతుంటుంది. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మార్కెటింగ్ శాఖ నిర్వహణలో ఉన్న ఏకైక నిమ్మ మార్కెట్ కు గతేడాది ఏప్రిల్, మే నెలల్లో రోజుకు పది వేల బస్తాల నిమ్మకాయలు రాగా ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. గత అక్టోబర్- జనవరి మధ్య కురిసిన అధిక వర్షాలు, అకాల వర్షాలకు తోడు, వాతావరణంలో మంచు, తేమ కారణంగా నిమ్మ పంటలో పూత, పిందె దెబ్బతినింది. అంతేకాక చెట్లకు తెగుళ్లు సోకడంతో పంట దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో ఈ ఏడాది మార్కెట్ కి వచ్చిన బస్తాలు మూడు వేలకు మించలేదనీ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

నల్లగొండ కేంద్రంగా నిమ్మకాయల సాగు, మార్కెటింగ్..

ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ సాగు (Lemon cultivation) చేస్తున్నారు. గతంలో ఇక్కడి పంటలో 80 శాతం వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం 40 నుంచి 50 శాతం పంట ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. మిగతాది స్థానిక మార్కెట్లకు రిటైల్ అమ్మకాల కోసం వెళుతోంది. దిగుబడులు తగ్గడంతో మార్కెట్ లో నిమ్మ ధర పెరిగింది. అదే సమయంలో వర్షాలు వలన, ఎండల వలన నిమ్మ వినియోగంపై నేరుగా ప్రభావం పడుతోంది. ధర ఉన్నప్పుడే పంటను అమ్ముకోవాలనీ రైతులు (Farmers) భావిస్తున్నారు. ఫలితంగా పారు కాయలు (ఇంకా పక్వానికి ) తెంపి మార్కెట్ కు తీసుకొస్తున్నారు.

సైజును బట్టి నిమ్మకాయలకు ఈ సీజన్లో టిక్కి (25 కిలోలు)కి రూ. 2500 నుంచి రూ. 3000 వరకు ధర పలికింది. దీంతో రైతులు పెద్దకాయతో పాటు పారుగాయలను అధికంగా విక్రయానికి తీసుకొస్తున్నారు. ఇక రిటైల్ వ్యాపారులకు ఒక్కో నిమ్మకాయ రూ. ఒకటి నుంచి రెండు రూపాయలకు లభిస్తే.. అది కాస్త వినియోగదారుడికి చేరేసరికి రూ. ఐదు పలుకుతుంది.

ముందే కోత కోస్తున్న రైతులు, నిమ్మలో తగ్గుతున్న పోషకాలు..

మార్కెట్లో గిరాకీ ఉందంటూ పక్వానికి రాని నిమ్మకాయలను సైతం ముందుగానే కోస్తున్న రైతులు, వాటిని మార్కెట్ కు తరలిస్తున్నారు. అయితే పక్వానికి వచ్చిన కాయల రసంలోనే పోషక విలువలు ఉంటాయి. రైతులు ఇలా పండిన నిమ్మకాయలనే మార్కెట్ తీసుకురావడం మంచిదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నిమ్మకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అంత పేరు ఉన్న ఈప్రాంతం నుంచి రసం లేని, నాణ్యత లేని నిమ్మకాయలు ఎగుమతి అయితే.. భవిష్యత్ లో అంత మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అకాల వర్షాలు, పంట తెగుళ్ల కారణంగా నష్టం వాటిల్లకుండా రైతులు మాత్రం ముందే కోత కోస్తున్నట్లు చెబుతున్నారు.

First published:

Tags: Agriculture, Lemon, Local News, Nalgonda

ఉత్తమ కథలు