టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతికి కారణం అదేనా ?
చింతల కనకారెడ్డి (ఫైల్ చిత్రం)
2014లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగా, అందులో మల్కాజ్ గిరి ఒకటి కావడం విశేషం. 2014లో టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ లో అంతగా బలం లేకపోయినప్పటికీ కనకారెడ్డి తన సొంత ఇమేజీతో గెలిచారని రాజకీయవర్గాల్లో వాదన ఉంది.
మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కనకారెడ్డి సికింద్రబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూయడంతో నగరంలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం ఆవరించింది. 2014లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన కనకారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగా, అందులో మల్కాజ్ గిరి ఒకటి కావడం విశేషం. 2014లో టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ లో అంతగా బలం లేకపోయినప్పటికీ కనకారెడ్డి తన సొంత ఇమేజీతో గెలిచారని రాజకీయవర్గాల్లో వాదన ఉంది. అయినప్పటికీ 2018 ముందస్తు ఎన్నికల్లో అనూహ్యంగా మల్కాజిగిరి టిక్కెట్ కనకారెడ్డికి దక్కకపోవడం శ్రేణులను ఆశ్చర్యపరిచింది. అనారోగ్య కారణం వల్లనే కనకారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ, అసలు టిక్కెట్ దక్కకపోవడం వల్లనే కనకారెడ్డి అనారోగ్యం పాలయ్యారనే టాక్ వినిపిస్తోంది.
ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన వారిలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు దక్కాయి. ఆరోపణలు ఎదుర్కొన్నవారికి సైతం టిక్కెట్లు దక్కాయి. అయితే కనకారెడ్డికి మాత్రం టిక్కెట్ దక్కకపోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణం చెబుతూ అప్పట్లో సీఎం కేసీఆరే స్వయంగా మల్కాజిగిరి సీటు నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే కనకా రెడ్డికి టిక్కెట్ దక్కకపోవడం వెనుక పెద్ద కుట్రే జరిగిందనే వాదనలు ఆయన సన్నిహితులు వద్ద వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధిష్టానానికి కనకారెడ్డి గురించి రాంగ్ ఫీడింగ్ ఇవ్వడంలో పార్టీలోనే ఒక వర్గం బలంగా ప్రయత్నించి విజయం సాధించిందనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం టీఆర్ఎస్ అధిష్టానాన్ని ప్రభావితం చేసి టికెట్ దక్కించుకున్నారు. అయితే తనకు ఎలాగైనా టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తుందని ఆశించిన కనకారెడ్డికి పార్టీ నిర్ణయం శరాఘాతమైందనే చెప్పవచ్చు. అప్పటి నుంచే కనకారెడ్డి అనారోగ్యం పాలయ్యారని ఆయన సన్నిహితుల వాదన.
మరోవైపు కనకారెడ్డి కోడలు టీఆర్ఎస్ కార్పోరేట్ శాంతికి టిక్కెట్ దక్కుంతుందని అంతా అనుకున్నారు. కనకారెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి సైతం కనీసం తనకైనా టిక్కెట్ దక్కుతుందని ఆశించారు. అయితే కనకారెడ్డి కుటుంబీకులు కాకుండా మైనంపల్లి టిక్కెట్ ఎగరేసుకుపోవడంతో కుటుంబంలో చిచ్చు పెట్టినట్లయ్యిందనే వాదన ఉంది. కొడుకు, కోడలు ఇద్దరిలో ఒకరికి టిక్కెట్ దక్కించుకోలేకపోయాననే బాధ కనకారెడ్డి వెంటాడిందనే వాదన ఉంది. పార్టీలో తలెత్తిన వర్గ అధిపత్య పోరులో కనకారెడ్డి బలయ్యారని సన్నిహితులు వాదిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.