• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • READ THE LOVELY STORY OF CROW AND WOMAN FRIENDSHIP IN KHAMMAM DISTRICT BA KMM

Khammam: ఆమె మీనా.. ఆమెకో వాణి.. ఇదో కాకి ప్రేమ కథ..

Khammam: ఆమె మీనా.. ఆమెకో వాణి.. ఇదో కాకి ప్రేమ కథ..

ఖమ్మం జిల్లాలో కాకిని పెంచుకుంటున్న మీనా

ప్రేమ.. ఆదరణ.. వాత్సల్యం లాంటివి మనుషుల మధ్యనే.. పైగా కని పెంచిన పిల్లల పట్లే ఉండాల్సిన పనిలేదని.. ఈ భూమి మీద ఏ జీవితోనైనా మనం ప్రేమగా ఉంటే.. మనకు మళ్లీ అదే స్థాయిలో ప్రేమ తిరిగొస్తుందని చేతలతో చేసి చూపిస్తోందీ మహిళ. నిజమే మరి.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కరస్పాండెంట్, న్యూస్ 18)

  కాకి పిల్ల కాకికి ముద్దు. అన్నది నిజంగా సామెతే. పైగా చాలా పాతది అంటుంది ఈమె. కాకి పిల్ల మనిషికీ ముద్దేనంటుంది మీనా. అదేంటమ్మా విడ్డూరం ఎక్కడా వినలేదే.. అంటూ మూతి ముడుచుకున్నారా..! పెంచితే తెలుస్తుంది మీకు ప్రేమంటే ఏంటో అంటుంది ఈ మీనా. ప్రేమ.. ఆదరణ.. వాత్సల్యం లాంటివి మనుషుల మధ్యనే.. పైగా కని పెంచిన పిల్లల పట్లే ఉండాల్సిన పనిలేదని.. ఈ భూమి మీద ఏ జీవితోనైనా మనం ప్రేమగా ఉంటే.. మనకు మళ్లీ అదే స్థాయిలో ప్రేమ తిరిగొస్తుందని చేతలతో చేసి చూపిస్తోందీ మహిళ. నిజమే మరి. ఆమె దాదాపు రెండేళ్లుగా ఓ కాకి పిల్లను పెంచుకుంటోంది. మనం ఇప్పటిదాకా చిలుకల్ని.. పావురాళ్లను.. ఇంకా పోతే నెమళ్లను పెంచుకునేవాళ్లను చూశాం.. విన్నాం.. జంతువుల్లో అయితే పిల్లిని.. కుక్కను పెంచుకున్న వాళ్లను చూశాం.. ఇదేంటి.. ఈ కాకి పెంపకం ఏంటి అంటే..? అది అంతే అంటుంది మీనా.. అవును ఇలా కాకిని పెంచుకుంటున్న మహిళ పేరు మీనా.. ఆమె తన ముద్దుల కాకికి పెట్టిన పేరు వాణి. ఈ మీనా.. వాణిల కథేంటో చూద్దామా..

  ఖమ్మం నగరంలోని నెహ్రూనగర్‌లో ఉండే మీనాకు సహజంగానే పెంపుడు జంతువులన్నా.. పక్షులన్నా మక్కువ. రెండేళ్ల క్రితం తన ఇంటి ముందు ఉన్న చెట్టు పైన కాకి గూడు పెట్టి నాలుగు గుడ్లను పొదిగింది. ఈ క్రమంలో ఒక రోజు వర్షం పడిన సమయంలో కాకి కరెంటు తీగలకు తగిలి చనిపోయింది. కొద్ది రోజులకు కాకి ఏర్పాటు చేసుకున్న గూడు సైతం పాడై పోయింది. ఇదంతా గమనిస్తున్న మీనా ఆ గుడ్లను జాగ్రత్తగా ఒకచోట పెట్టింది. కొద్ది రోజులకు అవి పగిలి పిల్లలు బయటకొచ్చాయి. వాటికి ఆహారం పెట్టి సాకింది. రెక్కలొచ్చిన కొద్ది రోజులకు మూడు కాకి పిల్లలు వెళ్లిపోగా.. ఒకటి మాత్రం మీనాను అంటిపెట్టుకుని ఉండిపోయింది. అప్పటి నుంచి ఆ కాకి పిల్లకు మీనానే ప్రపంచం. ఆమెతోడిదే జీవితం అన్నట్టుగా ఉంది. దీంతో మీనా కూడా ఆ కాకి పిల్లకు వాణి అని పేరు పెట్టి.. తన బిడ్డలాగానే పెంచుకుంటోంది. ఉదయాన్నే నిద్ర లేవడం.. స్నానం చేయడం.. దేవుడి కోసం తెచ్చిన పూలను నోటితో దేవుడి పటం వద్ద పెట్టడం.. తీర్థం పుచ్చుకోవడం.. ఫలహారం తినడం.. ప్రేమగా తల నిమిరించుకోవడం.. అప్పుడప్పుడూ కసురుకుంటే కావ్‌.. కావ్‌ అంటూ అరుస్తూ అలగడం.. అచ్చం మనిషిలాగే చేస్తూ మీనానే అంటిపెట్టుకుని ఉండిపోయింది. బయట చెట్ల పైకి ఎన్ని రకాల పక్షులొచ్చినా.. చివరకు కాకులొచ్చినా వాటి వంక కూడా చూడకుండా తనను తల్లిలా సాకిన మీనా వద్దే ఉండిపోయింది. ఎప్పుడైనా వెళ్లిపో అంటూ కోపగించుకుంటే ఆమె తల.. భుజాలపై కూర్చుని పెద్ద పెద్దగా అరుస్తుంటుందని చెబుతారు చుట్టుపక్కల వాళ్లు. మొత్తం మీద ఈ మీనా.. వాణిల కథ మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది.

  ఖమ్మం జిల్లాలో కాకిని పెంచుకుంటున్న మీనా


  నిజానికి కాకికి.. మనిషికి మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. తరతరాలుగా వస్తున్నదే. మనం నిత్య జీవితంలో ఎవరైనా గోల చేస్తుంటే ఏంటిది.. కాకిగోల అంటుంటాం.. అలాగే ఎక్కడైనా ఒక మనిషికి మరో మనిషి అన్యాయం చేస్తేనో.. లేక కుటుంబ సభ్యులు అయిన వారిని నిరాదరణకు గురిచేస్తేనో.. కష్టం వస్తే కాకుల్లా మూగి సాటి కాకిని ఆదుకుంటాయి.. రానురాను మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోందంటూంటాం. ఇంకా ఇలా ఎన్నో సామెతలు.. జాతీయాలు కాకితోనే పుట్టి మన నిత్య జీవితంలో వాడుకగా కలిసిపోయాయి. దీనికి తోడు మనం పితృకర్మలు చేసే సమయంలో పిండాన్ని కాకులు వచ్చి ముట్టకపోతే.. మన పట్ల మన మధ్య నుంచి దూరమైన పెద్దలు కోపంగా ఉన్నారనో.. లేక బాగా ప్రేమించిన వారు రాలేదనో.. వాళ్లు పెట్టకపోవడంతోనే కాకులు రాలేదని నమ్ముతుంటాం. ఇంతటి అనుబంధం ఉన్నా.. ఇప్పటిదాకా కాకిని పెంచుకున్న వారిని మాత్రం దాదాపు చూసి ఉండకపోవచ్చు. అప్పుడప్పుడూ అక్కడక్కడా అద్భుతాలు జరిగినట్టు.. ఇక్కడా ఒకామె కాకిని పెంచుకుని ఆలోటును తీర్చేసింది. ఇదండీ ఈ మీనా.. వాణిల కథ.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: