RARE INCIDENT IN JAGTIAL DISTRICT POLICE ARRESTED A COCK IN A MAN DEATH DUE TO COCK KNIFE FULL DETAILS HERE HSN KNR
మర్మాంగాలకు కోడి కత్తి తగిలి ఓ వ్యక్తి చనిపోయాడని తెలుసు కదా..? మరి ఆ తర్వాత పోలీసులు ఏం చేశారో తెలిస్తే..
కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కోడి పందేల్లో తన వెంట తెచ్చుకున్న కోడికి కత్తిని కడుతుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చనిపోయిన ఘటన గురించి మీరు చదివే ఉంటారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరి ఈ కేసు విచారణలో ఏం తేల్చారంటే..
కోడి పందేలకు వెళ్లి, తన వెంట తెచ్చుకున్న కోడికి కత్తి కడుతూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఓ కాలికి కోడి కత్తి కట్టి, రెండో కాలికి కూడా కత్తిని కట్టే క్రమంలో కోడి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అతడి మర్మాంగాలకు కోడి కత్తి తగిలింది. దీంతో అతడు మరణించాడు. మరి ఈ ఘటనలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏం చేశారో? ఎవరిని దోషిగా తేల్చారో తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతారు. జగిత్యాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో కోడి పందేలు జరుగుతున్నాయని తెలిసి వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్ అనే 45 ఏళ్ల వ్యక్తి కూడా వెళ్లాడు.
తాను ఎన్నాళ్లుగానో పెంచుకుంటున్న కోడితో సహా పందేలు జరుగుతున్న ప్రాంతానికి సతీష్ చేరుకున్నాడు. అప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులు కోడి పందేల్లో పాల్గొనేందుకు అక్కడికి ఉత్సాహంగా వచ్చారు. వాటిని చూడటానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఈ క్రమంలోనే తనుగుల సతీష్ తన కోడిని పందేనికి సిద్ధం చేయాలని భావించాడు. తనతోపాటు తెచ్చుకున్న కోడి కత్తులను బయటకు తీశాడు. ఓ చోట కూర్చుని కోడిని తన కాళ్ల మధ్యలో పెట్టుకుని కాళ్లకు కోడికత్తులను కట్టేందుకు యత్నించాడు. అలాగే ఓ కాలికి కోడి కత్తిని కట్టాడు. రెండో కాలికి కట్టేందుకు ప్రయత్నిస్తుండగా అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది.
దాన్ని గట్టిగా పట్టుకునేందుకు సతీష్ ప్రయత్నించడం, అది తప్పించుకునేందుకు వీలును చిక్కించుకోవడం చకచకా జరిగాయి. మామూలుగా అది ఎగిరిపోతే ప్రమాదం ఏమీ జరగకపోయేదే. కానీ తప్పించుకునే క్రమంలో ఆ కోడి కాలికి కట్టిన కత్తి సతీష్ మర్మాంగాలకు తగిలింది. దీంతో అతడి పురుషాంగం, వృషణాలు బాగా దెబ్బతిన్నాయి. తీవ్ర గాయాలయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న వాళ్లు స్పందించి జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. ఈ ఘటనలో వ్యక్తి మరణించాడు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మరి నేరం ఎవరిది? ఎవరి కారణంగా ఇతడు చనిపోయాడు? ఎవరిని దోషిగా తేల్చాలి? అన్నదానిపై పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు.
ఎవరు బాద్యులు అనే కోణంలో అలోచించి చివరకు కోడిదే తప్పని భావించిన గొల్లపల్లి పోలీసులు ఎట్టకేలకు కోడి పుంజును వెతికి మరీ పట్టుకున్నారు. శుక్రవారం ఆ కోడిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. స్టేషన్ లోనే బంధించారు. ఖైదీలకు ఇచ్చినట్టుగానే కోడికి ఆహారంగా దాణా కూడా పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రత గా పోలీసులు పహారా కాస్తున్నారు. మరి కోడి పుంజును అయితే అర్టెస్ట్ చేశారు. మరి దానికి ఎలాంటి శిక్ష వేస్తారు? తదుపరి పోలీసులు ఏం చేయబోతున్నారు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి నేరం చేసిన కారణంగా పోలీసుల అదుపులో ఉన్న ఈ కోడి భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.