M.Balakrishna,News18,Hyderabad
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఇక దురదృష్టమైతే మనం ఎప్పుడెప్పుడు తలుపు తీస్తామా అని గుమ్మం ముందే తిష్ట వేస్తుంది. తాజాగా ఓ కుర్రాడి ఆన్ లైన్ గేమ్ సరదా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అదృష్టం కలిసొస్తే ఆన్ లైన్ గేమ్ ద్వారా డబ్బులు బాగా సంపాదించాలనుకున్నాడో లేక సరదా కోసం క్యాసినో గేమ్ ఆడాడో తెలియదు కానీ ఆ ఆన్ లైన్ ఆట కొంపను నిండా ముంచింది. వందలు కాదు వేలు కాదు ఏకంగా 92 లక్షలు అక్షరాల 92 లక్షల రూపాయలు ఆన్ లైన్ గేమ్ ద్వారా స్వాహా అయ్యాయి. చూస్తుండగానే విడతల వారీగా డబ్బులు ఉఫ్ అయ్యాయి. కొడుకు చేసిన ఈ పనికి ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి వ్యవసాయాధారిత కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు శ్రీపాల్ హైద్రాబాద్ లో బీటెక్ చదువుతున్నాడు. చిన్న కొడుకు హర్షవర్ధన్ రెడ్డి నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కొడుకులను శ్రీనివాస్ దంపతులు చదివించుకుంటున్నారు. అయితే ఇటీవల వారి భూములను ప్రభుత్వం TSIICకి అప్పగించింది. ఆ భూమికి సంబంధించిన పరిహారం కింద ఎకరానికి రూ.10.5 లక్షల కింద రూ.1.05 కోట్లు వారికి ఇచ్చింది. ఇందులో కొంత మొత్తంతో శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద అర ఎకరం పొలాన్ని కొనాలని బేరసారాలు చేసి కొంత డబ్బును అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు శ్రీనివాస్. అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చిన తరువాత మిగిలిన డబ్బులను శ్రీనివాస్ తన పేరిట, తన భార్య పేరిట మొత్తం సుమారు రూ.1 కోటి వరకు ఖాతాలో వేసుకున్నారు.
మరోవైపు కుమారుడు చదువుకుంటున్నాడు కదా అని శ్రీనివాస్ మొబైల్ కొనిస్తే అందులో ఆన్ లైన్ క్లాసులు చూసేది పోయి ఆన్ లైన్ గేమ్ కు అలవాటుపడ్డాడు. భూ పరిహారం కింద డబ్బులు వచ్చిన విషయం తెలుసుకున్న హర్షవర్ధన్ శంషాబాద్ సమీపంలో కొనదల్చుకున్న భూమి యజమానికి డబ్బులు ఇస్తా అని చెప్పడంతో ఖాతాలోని డబ్బును తండ్రి ఖాతా నుండి బదిలీ చేసుకున్నాడు. ఈ డబ్బులను ఆ యజమానికి ఇవ్వకపోగా యువకుడు ఫోన్ లో క్యాసినో 567 గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. తన ఖాతాకు బదిలీ చేసుకున్న డబ్బును హర్షవర్ధన్ పలు దఫాలుగా ఆటలో పెట్టి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఖాతాలో ఉన్న డబ్బును కూడా డ్రా చేయించి తన వద్ద ఉంచుకున్నాడు. ఆన్ లైన్ గేమ్ కు అలవాటుపడ్డ హర్షవర్ధన్ పోయిన డబ్బుల రికవరీ కోసం ఉన్న డబ్బులను కాస్త పెట్టి గేమ్ ఆడసాగాడు. ఈ క్రమంలో మొత్తం డబ్బును కూడా కోల్పోయాడు.
ఇక డబ్బులు ఎవని కొడుకును గట్టిగా నిలదీసిన తల్లిందండ్రులకు హర్షవర్ధన్ కళ్లు బైర్లుగొలిపే వార్త చెప్పాడు. డబ్బంతా ఆన్ లైన్ గేమ్ లో పోయిందని పేరెంట్స్ కు చెప్పాడు. సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు ఏకంగా 92 లక్షలు స్వాహా అయినట్లు హర్షవర్ధన్ తెలిపాడు. కొడుకు చేసిన పనికి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. కొడుకును ఏమైనా అంటే ఏం చేసుకుంటాడో అని వాళ్లలో వాళ్లే కుమిలిపోతున్నారు. డబ్బులు పోవడంతో హర్షవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Rangareddy, Telangana