త్వరలోనే బీజేపీలో చేరనున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ వెంట ఇంకా ఏయే నేతలు కాషాయ కండువా కప్పుకుంటారనే ఆసక్తి తెలంగాణ రాజకీయవర్గాల్లో నెలకొంది. కొంతకాలంగా ఈటల రాజేందర్ వెంట ఉంటున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ బీజేపీలో చేరతారనే వార్తలు వినిపించాయి. అయితే ఈటలతో పాటు మరికొందరు నేతలను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరికొందరు నేతలు కూడా ఈటలతో పాటు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌తో పాటు టీఎంయూ మాజీ నేత అశ్వత్ధామరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఇద్దరు కూడా ఈటల రాజేందర్ నివాసంలో ఆయనతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సైతం కూడా బీజేపీలో తీసుకురావాలని బీజేపీ నేతల ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి మాజీమంత్రి డీకే అరుణ కొద్దరోజుల క్రితం విశ్వేశ్వర్ రెడ్డితో చర్చలు జరిపారు.
అయితే బీజేపీలో చేరే విషయంలో ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మొత్తానికి ఈటల రాజేందర్‌తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేశ్ రాథోడ్, అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్.. అంతకంటే ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.