Ramappa Temple: అది దేవుడి పేరు కాదు.. రాజు పేరూ కాదు.. మరి రామప్ప ఆలయం పేరెలా వచ్చింది?

రామప్ప టెంపుల్

తెలంగాణ రాజధాని హైదరాబాద్​కు 210 కిలోమీటర్లు, కాకతీయుల వైభవాన్ని చాటే వరంగల్​కు 66 కిలోమీటర్ల దూరం ఉన్న రామప్ప దేవాలయం దేశానికే గర్వకారణంగా ఉంది. ఇప్పుడు యునెస్కో గుర్తింపుతో ప్రపంచ వ్యాప్తంగా దీనిగొప్పతనం అందరికీ తెలుస్తుంది.

  • Share this:
తెలంగాణ ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉన్న ప్రసిద్ధ రామప్ప ఆలయానికి ప్రపంచ ఖ్యాతి దక్కిన విషయం తెలిసిందే. అద్భుత శిల్పాలకు నెలవైన రామప్ప ఆలయాన్ని.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం (వరల్డ్ హెరిటేజ్ సైట్​)గా ప్రకటించింది. దీంతో ఈ అపూర్వ కట్టడం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ శిల్ప అద్భుత దేవాలయానికి ప్రపంచ సొబగులు దక్కనున్నాయి. అధునాతన హంగులతో మరింత ఆకర్షణీయంగా, ప్రపంచ పర్యాటక కేంద్రంగా వెలుగొందనుంది. రామప్ప ఆలయంలోని శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది. ఆధునిక ప్రపంచ కూడా అబ్బురపోయే విధంగా ఆ నాటి శిల్పుల ప్రతిభ ప్రతిబింబిస్తుంటుంది. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది. ఎప్పుడో ప్రపంచ ఖ్యాతి రావాల్సిన ఈ కట్టడానికి కాస్త ఆలస్యంగానైనా యునెస్కో గుర్తింపునిచ్చింది.

రామప్ప ఆలయం అద్భుతంగా కట్టడంగా వెలుగొందడం వెనుక శిల్పుల దశాబ్దాల శ్రమ ఉంది. ఆ కట్టడం విశిష్టత వెనుక వారి కృషి అపారం. దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ ఆలయం కోసం శిల్పులు చెమటోడ్చారు. శిలలను అద్భుత శిల్పాలుగా తీర్చిదిద్దారు. రామప్ప ఆలయాన్ని అద్భుతం చేశారు. ఈ ఆలయాన్ని దేశానికే గర్వకారణంగా తీర్చిదిద్దారు. కాకతీయ పాలనకు ఎనలేని సాక్ష్యంగా నిలిపారు. ఇలాంటి అపూర్వమైన రామప్ప ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుకోండి.

కాకతీయ రాజు గణపతి దేవ పాలనలో రాచెల రుద్రారెడ్డి ఈ ఆలయాన్ని కట్టించారు. 1212లో ఈ ఆలయాన్ని కట్టించినట్టు చరిత్ర చెబుతోంది. కాకతీయులు వీరశైవులు. వారు శివుడినే కొలుస్తారు. వారి పాలనలో వరంగల్​, హన్మకొండ, పిల్లలమర్రి, పాలంపేట, నాగుపాడు, కొలనుపాకలో ఎన్నో శివాలయాలు నిర్మించారు.

రామప్ప ఆలయం


ఇసుక రాతితో నిర్మించిన రామప్ప ఆలయం నిర్మాణం 1231 నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు సాగింది. ఎంతో నైపుణ్యం ఉన్న శిల్పులు.. అక్కడి రాళ్లను అద్భుత శిల్పాలుగా మరిచారు. కాకతీయ వైభవం కళ్లకు కట్టేటట్టు.. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా దేవాలయ ఆవరణలో శిలలు చెక్కారు. సహజంగా ఏవైనా  ఆలయాలకు గుళ్లో ఏ దేవుడిని ప్రతిష్టించారో ఆ ఆలయం పేరు పెడతారు. లేకపోతే ఫలానా రాజు హయాంలో కట్టించారని తెలిసేందుకు గానూ.. రాజుల పేర్లు  కలసి వచ్చేలా పేర్లు పెడతారు. కానీ, ఇక్కడ మాత్రం 40 ఏళ్ల పాటు శ్రమించిన శిల్పి రామప్ప పేరు పెట్టడం అప్పటి రాజుల గొప్పదనం.

రామప్ప ఆలయంలో అద్భుతమైన శిల్ప సౌందర్యం


అత్యంత దృఢమైన, సుందరమైన శిల్పాలున్న భారీ గోడలతో ఆ రామప్ప శివాలయం ఉంది. అలాగే ఆవరణలో ఎంతో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. రుద్రేశ్వర దేవాలయంగానూ పేరు ఉన్న ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అలాగే దేవాలయంలో ఎంతో సుదరమైన స్తంభాలు ఎన్నో ఉన్నాయి.

అలాగే రామప్ప ఆలయం సమీపంలో కాకతీయులు ఓ నీటి రిజర్వాయర్​ను కూడా కట్టించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతం పచ్చదనంతో నిండిఉంటుంది. ప్రకృతి అందాల నడుమ ఉండాలనే ఈ అద్భుత కట్టడానికి కాకతీయులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు చరిత్రలో ఉంది.

రామప్ప ఆలయం


కొండల మధ్య, అడవి సమీపంలో, చెరువులు, వ్యవసాయ భూముల సమీపంలో ఈ అందమైన రామప్ప దేవాలయం ఉంది. ఎంతో దృఢంగా, సుందరంగా ఉండే రామప్ప దేవాలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని బలంగా నిలిచింది. చెక్కుచెదరకుండా ఉంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్​కు 210 కిలోమీటర్లు, కాకతీయుల వైభవాన్ని చాటే వరంగల్​కు 66 కిలోమీటర్ల దూరం ఉన్న రామప్ప దేవాలయం దేశానికే గర్వకారణంగా ఉంది. ఇప్పుడు యునెస్కో గుర్తింపుతో ప్రపంచ వ్యాప్తంగా దీనిగొప్పతనం అందరికీ తెలుస్తుంది. అలాగే అధునాతన సదుపాయాలు కూడా ఆలయానికి చేకూరి.. మళ్లీ పునర్వైభవంతో వెలిగిపోతుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published: