Home /News /telangana /

RAMA OR NARAYAN NEW CONTROVERSY IN BHADRADRI RAMA TEMPLE SK

రాముడా? నారాయణుడా? భద్రాద్రిలో కొత్త వివాదం.. అర్చకులకు నోటీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీతారాముల కళ్యాణంలో వారి గోత్రనామాలు, ప్రవరల స్థానంలో లక్ష్మీనారాయణుల గోత్రనామాలు, ప్రవరలను చదువుతున్నారని గత కొన్నేళ్లుగా వివాదం సాగుతునే ఉంది.

  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 ఖమ్మం కరెస్పాండెంట్)

  రాముడా..? నారాయణుడా..? దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిని ఇప్పుడు ఏ పేరుతో పిలవాలి? రాముడనా.. నారాయణుడనా..? అదేంటి సాక్షాత్తూ నారాయణుడంటే విష్ణుమూర్తే కదా.. మరి దశావతారాల్లో రామావతారం ఒకటి కదా..? మరి ఈ ప్రశ్నేంటి. ఇది సామాన్యులకు వచ్చిన సందేహం కాదు. వేద విజ్ఞానం కలిగిన పండితులు, అర్చక స్వాములకు మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న వివాదం. తాజాగా భద్రాద్రి రామాలయంలో అర్చకులకు వచ్చిన లీగల్‌ నోటీసులతో మరోసారి ఈ వివాదం తెరిపైకి వచ్చింది.

  శ్రీరామ నవమి సహా, నిత్య కళ్యాణాలలో, అన్ని పూజాధికాలలో స్వామి వారి గోత్ర నామాలు, ప్రవరలు తప్పుగా పేర్కొంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇది కావాలని చేస్తున్న కుట్రగా పేర్కొంటున్నారు. దీనిపై భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఇప్పటికే ఆలయ కార్యనిర్వహణాధికారికి లిఖిత పూర్వకంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసి, తప్పులను సరిచేయాలని, మళ్లీ జరగకుండా చూడాలని కోరింది. ఈ వివాదం మూలాల్లోకి వెళ్తే..

  శ్రీరాముని గోత్రం వశిష్ట. నారాయణుని గోత్రం అచ్యుత. సీతమ్మ వారి గోత్రం గౌతమ. లక్ష్మీదేవి గోత్రం సౌభాగ్య. కాగా సీతారాముల కళ్యాణంలో వారి గోత్రనామాలు, ప్రవరల స్థానంలో లక్ష్మీనారాయణుల గోత్రనామాలు, ప్రవరలను చదువుతున్నారని గత కొన్నేళ్లుగా వివాదం సాగుతునే ఉంది. వాస్తవానికి భక్తరామదాసు భద్రాద్రిలో నిర్మించిన సీతారామాలయం ప్రాంగణంలో ఉన్న మిథిల స్టేడియంలో అప్పటి నుంచి నవమికి సీతారాముల కళ్యాణం జరపడం, దానికి అప్పటి నుంచి తానీషా సహా పాలకులు ఎవరైనా ముత్యాల తలంబ్రాలు, పట్టుబట్టలు తేవడం ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో ముస్లిం పాలకులు కూడా ప్రజా విశ్వాసాలను గౌరవించి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం తెలిసిందే.

  స్వాతంత్య్రానంతరం కూడా ప్రభుత్వం తరపున సాక్షాత్తూ ముఖ్యమంత్రే రావడం సంప్రదాయంగా వస్తోంది. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టుబట్టలు తేవడాన్ని తమకు దక్కిన అదృష్టంగా భావిస్తుంటారు. అయితే సీతారాముల కళ్యాణ సమయంలో చదివే వేదమంత్రాలలో ''శ్రీరామచంద్ర స్వామినే వరాయ'' అనే దానికి బదులుగా ''శ్రీరామ నారాయణ స్వామినే వరాయ'' అనే మంత్రాన్ని చదవడాన్ని వేదపండితులు తప్పుపడుతున్నారు. దీనిపై చీరాలకు చెందిన అన్నదానం చిదంబరశాస్త్రి అనే భక్తుడు 'భద్రాద్రీశునకు జరుగుతున్న ఘోరఅపచారం' పేరిట పుస్తకాన్ని ప్రచురించారు. తెలుగు రాష్ట్రాలలో దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సోషల్‌మీడియా వేదికగా జరిగిన చర్చోపచర్చలు, ఉత్తరప్రత్యుత్తరాలలో తనను అవమానించారని, సీతమ్మవారు, రాముల వార్లకు జరుగుతున్న అన్యాయం, భక్తజనం నమ్మకాలను వమ్ముచేస్తున్న తీరుపై లీగల్‌ నోటీసులు పంపారు. శ్రీరామచంద్రుడు అన్న పదంలో చంద్రుడు శివాంశ కనుక దానికి ఉచ్ఛరించడానికి అక్కడి అర్చకులు ఇష్టపడడం లేదని, దీన్ని శివకేశవుల మధ్య అంతరం సృష్టించే ప్రయత్నంగా పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రధాన అర్చకులను ప్రతివాదులుగా చేస్తూ ఈ మేరకు నోటీసులు పంపారు. దీంతో ఈ వివాదం మరోసారి చర్చకు దారితీసింది.

  కరోనా ఎఫెక్ట్... భద్రాది రాముడి కళ్యాణ వేదిక మార్పు ? | Bhadrachalam lord ram marriage ceremony venue may change due to coronavirus effect ak
  భద్రాచలం (ఫైల్ ఫోటో)


  ఐతే శైవ, వైష్ణవాల నడుమ సాగుతున్న ఆధిపత్య పోరాటంలో భద్రాద్రిని వాడుకుంటున్నారని, సీతారామ క్షేత్రానికి అపఖ్యాతి తెస్తున్నారని ఇక్కడి అర్చకులు విమర్శిస్తున్నారు. దీనిపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. దీనిపై భద్రాద్రి పరిరక్షణ కమిటీ తరపున తామంతా అభ్యంతరం వ్యక్తం చేశామని, భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం చేయించాలని, లక్ష్మీనారాయణుల కళ్యాణం కాదని కమిటీ ప్రతినిధి బూసిరెడ్డి శంకరరెడ్డి పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అర్చకులు పట్టించుకోవడం లేదని, ఇక్కడ అర్చకుల నిరంకుశ ధోరణి సరికాదని వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి మరికొన్నేళ్లు కొనసాగితే భద్రాద్రి అంటే సీతారాముల స్థానే లక్ష్మీనారాయణులను మాత్రమే గుర్తొచ్చే విధంగా పరిస్థితులు తయారవుతున్నాయని ఆరోపించారు.

  గతంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా ఉపయోగించిన పదాలు, పేర్లను, ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదాలు, పేర్లకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగును ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది సహా, దైవ సేవలో ఉండి వేతనం తీసుకుంటున్న అర్చకులు సైతం ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ, ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా స్వామి పేర్లను మార్చడం సరికాదన్న వాదన వ్యాప్తిలో ఉంది.

  అయితే దీనిపై ఆలయ అర్చకులను 'న్యూస్‌18 తెలుగు' ప్రతినిధి సంప్రదించగా ఇది కేవలం వైష్ణవంపై జరుగుతున్న దాడి అన్నారు. ఎక్కడా లేని విధంగా భద్రాద్రిలో శ్రీరాముడు చతుర్భుజునిగా ఉంటాడని, శంకుచక్రాలు ధరించినట్టు విగ్రహాలు ఉంటాయన్నారు. పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయాలను, ఆలయ వైశిష్ట్యాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత తమదేనన్నారు. తామంతా సీతారాములకు నిత్య ఆరాధకులమని, తమను, క్షేత్రాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఏదేమైనా ఎంతో విశిష్టత కలిగిన భద్రాద్రిలో ఇలాంటి వివాదాలు చెలరేగడం, అదికాస్తా న్యాయ వివాదాలకు దారితీయడం సరికాదన్న వాదన కూడా వినిపిస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Badradri, Bhadrachalam, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు