Haribabu, News18, Rajanna Siricilla
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో మహిళలు కుటుంబపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు అందిస్తోంది. ఈ రుణాలను సకాలంలో చెల్లించే సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీని ఇస్తోంది. కానీ గత 4 సంవత్సరాలుగా రాయితీపై నీలి నీడలు కమ్ముకున్నాయనే చెప్పాలి. ప్రతి సంవత్సరం రుణాలు ఇస్తుంది. కానీ ప్రభుత్వం నుండి మహిళలకు ఇవ్వాల్సిన, సమాఖ్య సంఘాలకు రావాల్సిన రాయితీ మర్చిపోయింది. దీంతో జిల్లాలో ఉన్న మహిళా సమాఖ్య సంఘాలకు రావల్సిన వడ్డీ రాయితీ కోసం సంవత్సరాలుగా నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వం ఎప్పటి నుంచో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పిన మాట ఉత్తిదే అని మహిళా సంఘాల సభ్యులు వాపోతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో మహిళా సంఘాల సభ్యులు తమ వ్యక్తిగత కుటుంబ, వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు తీసుకున్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)
2017 నుంచి 2022 వరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నుండి బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 137 కోట్ల, 69 లక్షల, 54 వేల సిరిసిల్ల, వేములవాడలో ఉన్న మహిళ స్వయం సహకార సంఘాలకు రుణాలు ఇచ్చారు. 2017 నుంచి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకొని చెల్లించిన వడ్డీపై వడ్డీ రాయితీ మహిళా సంఘాలకు రూ.13 కోట్ల 5 లక్షల 14 వేల 227 రావాల్సి ఉంది.
రూ.కోట్లలో అందని వడ్డీ రాయితీ
మహిళామణులు చిరు వ్యాపారులుగా ఎదగాలని ఆదాయ అభివృద్ధికి కృషిచేసి కుటుంబానికి అండగా నిలవాలని ప్రభుత్వం ఏటా బ్యాంకు లింకేజీ, శ్రీనిధి మహిళ పథకాలతో రుణాలు అందిస్తూ వస్తుంది. రుణాలుగా తీసుకున్న మహిళా సంఘాల మహిళలు సక్రమంగా చెల్లిస్తున్నారు. కొందరు మాత్రమే రుణాలు తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు.
శ్రీనిధి రావాల్సిన వడ్డీ రాయితీ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా 2018 మార్చి వరకు మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ప్రభుత్వం అందించింది. శ్రీనిధి మహిళా బ్యాంకు నుండి జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించాల్సిన వడ్డీ రాయితీ రూ. కోట్లలో మిగిలిపోయింది.
మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ సంవత్సరాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. 2018-19లో రూ.7 కోట్ల 81 లక్షలు, 2019-20లో రూ.8 కోట్ల 34 లక్షలు, 2020-21లో రూ.8 కోట్ల 69. లక్షలు, 2021 - 22లో రూ.8 కోట్ల 69 లక్షలు, శ్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చిన వాటిపై వడ్డీ రాయితీ సుమారుగా రూ.32 కోట్ల 53 లక్షల రూపాయలు, మెప్మా నుండి బ్యాంకు లింకేజీ రుణాలు ద్వారా వచ్చే వడ్డీ రాయితీ రూ.13 కోట్ల 5 లోల 14 వేల రూపాయలు జిల్లాలో ఉన్న మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ ఉందని అధికారులు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో 88 స్లామ్ సమైక్యలు సిరిసిల్ల విలీన గ్రామాలు కలుపుకొని ఉన్నాయి. ఒక్కో స్లామ్ సమైక్యలో 230 నుంచి 25 వరకు మహిళా సంఘాలు ఉంటాయి. సిరిసిల్ల పట్టణంలో 2,296 మహిళా సంఘాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం 14,034 మహిళా సంఘాలు ఉన్నాయి.
కొన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నాం: మహిళా సంఘం సభ్యులు
వడ్డీ రాయితీ కోసం సంఘం సభ్యులందరం ఎదురు చూస్తున్నామని, ఈ కష్టకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించాలని కోరుతున్నారు.
నేరుగా సంఘాల ఖాతాలో జమవుతాయి: DRDO
"రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన సంఘాలకు వడ్డీ రాయితీ ఇస్తుంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. అయితే 2018 నుంచి వడ్డీ డబ్బులు జమ కావడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాల్సి ఉంది. అవి రాగానే మహిళా సంఘాల ఖాతాలో జమవుతాయ"ని డీఆర్డిఓ గౌతం రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dwakra, Local News, Siricilla, Telangana