(K. Haribabu, News18, Rajanna siricilla)
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla). వేములవాడ రాజన్న కొలువైన ప్రాంతం. అయితే వేములవాడ (Vemulawada) పట్టణంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇప్పటికే పట్టణంలో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. మరో అంశం పట్టణ వాసులను కలవరపెడుతుంది. పట్టణంలో అక్కడక్కడా ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలు (Iron Electric Poles) ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని వేములవాడ పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఏళ్ల నాటి విద్యుత్ స్తంబాలు ఇంకా వినియోగంలోనే..
విద్యుత్ సరఫరా నిమిత్తం గత కొన్నేళ్లుగా సిమెంట్ స్తంభాలను వినియోగిస్తున్నారు. ఈక్రమంలో వేములవాడ పట్టణంలో ఏళ్ల నాటి ఇనుప స్తంభాలనే విద్యుత్ సరఫరా కోసం వినియోగించడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతుంది. ఇనుప విద్యుత్ స్తంబాల వలన వర్షాకాలంలో ప్రమాదం పొంచి ఉంటుంది. వర్షాకాలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అదీగాక, ఇప్పటికే ఇనుప స్తంబాలు పూర్తిగా తుప్పు పట్టి, కూలిపోయే స్థితిలో ఉన్నట్లు పట్టణ వాసులు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట, కూడళ్లలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలని వేములవాడ పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో విద్యుత్ సమస్యలతో పాటు, రెండవ బైపాస్ ప్రాంతంలోని చిల్డ్రన్ పార్క్‌లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పాలక వర్గం దృష్టికి సమస్య..
వేములవాడ పట్టణంలో ప్రమాదకరంగా పొంచి ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాల విషయాన్నీ స్థానిక పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లారు న్యూస్ 18 ప్రతినిధి. ఈ అంశంపై వేములవాడ సెస్ డైరెక్టర్ పొలాస నరేందర్, ఏఈ సుష్మాలు స్పందిస్తూ చిల్డ్రన్స్ పార్క్‌లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్‌ను తొలగించేందుకు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, పాలకవర్గం సభ్యులతో చర్చించామని, అతి త్వరలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగిస్తామని తెలిపారు.
పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద రహదారుల వెంట ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను (Iron Electric Poles) తొలగించి వాటి స్థానంలో నూతన సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే తమ దృష్టికి వచ్చిన సమస్యలను 'పట్టణ ప్రగతిలో' భాగంగా ఎమ్మెల్యే రమేష్ (MLA ramesh) బాబు సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో విద్యుత్ వినియోగదారులు, ప్రజలు విద్యుత్ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సెస్ అధికారులు సూచించారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం..
వర్షాకాలం (Manson) నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సెస్ ఏఈ సుష్మా సూచించారు. వర్షం కురిసిన సమయంలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, విద్యుత్ సమస్యలు ఉంటే విధిగా అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వారి వారి వార్డుల్లో ఉన్న సమస్యలను మున్సిపల్ పాలకవర్గం లేదా సెస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అనేక విద్యుత్ సమస్యలు పరిష్కరించామని, ఎమ్మెల్యే రమేష్ బాబు మార్గనిర్దేశంలో సమస్యల పరిష్కారం దిశగా పాలకవర్గం కృషి చేస్తుందని సెస్ డైరెక్టర్ నరేందర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా వేములవాడలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. వేసవి కాలంలో సైతం ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రజలకు విద్యుత్ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Power problems, Siricilla, Vemulawada