Home /News /telangana /

RAJANNA SIRCILLA VEMULAWADA TRAFFIC SI HAS ISSUED A WARNING TO AUTO DRIVERS BRV ABH RKH

Rajanna Sircilla: ఆటో డ్రైవర్లకు పోలీసుల హెచ్చరిక.. రూల్స్ దాటారో!...

ఆటో

ఆటో డ్రైవర్లకు సూచనలు చేసిన వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ

రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, అదే విధంగా ఆటోలను ప్యాసింజర్ ఫ్రెండ్లీగా ఉంచుకోవాలని ఎస్ఐ దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

    (k.Haribabu, News 18, Rajanna Sircilla)

    ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేస్తూ వేములవాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వేములవాడ రాజన్న సన్నిధి పరిసరప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు, ఇతర ట్రావెల్ వాహనదారులకు హెచ్చరికతో కూడిన సూచనలు చేశారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, అదే విధంగా ఆటోలను ప్యాసింజర్ ఫ్రెండ్లీగా ఉంచుకోవాలని ఎస్ఐ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ఈమేరకు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆటో డ్రైవర్లు, కార్మికులకు ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల పట్ల ఆటో కార్మికులు, డ్రైవర్లు మర్యాదతో మెలగాలని సూచించారు.

    ఆటో కార్మికులు విధిగా నియమాలు పాటించాలి:
    ఆటో కార్మికుల విధిగా యూనిఫామ్ ధరించాలని, ఆటో ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ విధిగా వెంట ఉంచుకోవాలని ఎస్ఐ దిలీప్ పేర్కొన్నారు. ఆటోలపై అనవసరమైన కొటేషన్స్, రేడియంతో కూడిన స్టిక్కర్లు ఉండకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో విధిగా డయల్ 100 ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనదారులు ప్రమాదాల నివారణకు నియంత్రిత వేగంతో ప్రయాణించి ప్రమాదాలు అరికట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్టిఏ అధికారులు సూచించిన నియమనిబంధనలతో కూడిన విధంగా ఆటో నెంబర్ ప్లేట్ ఉండాలని అన్నారు.

    ఎస్ఐకు పూర్తిగా సహకరిస్తాం: వేములవాడ ఆటో యూనియన్ అధ్యక్షుడు
    ట్రాఫిక్ నియమనిబంధనలపై తమ ఆటో కార్మికులకు అవగాహన కల్పిస్తూ తమ క్షేమం కోసం ఎస్ఐ దిలీప్ కుమార్ చేస్తున్న సూచనలు పాటిస్తామని వేములవాడ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. కరోనా విపత్కర సమయం నుంచి ఆటో కార్మికుల జీవితాలు అస్తవ్యస్త మయ్యాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మరికొంత ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పోలీసులకు ఆటో కార్మికులు సహకరిస్తారని ఆటో యూనియన్ అధ్యక్షుడిగా మాట ఇస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

    వేములవాడ పట్టణంలో ప్రతిరోజు దాదాపు 1500 ఆటోలు తిరుగుతుంటాయి. దక్షిణ కాశీగా ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురిచేయకుండా ఆటో డ్రైవర్లు మర్యాదతో మెలగాలని ట్రాఫిక్ ఎస్ఐ సూచించారు. అలాగే ఆటోలలో ఆడియో డెక్కులను పెట్టరాదని, ఆటో వెనుక భాగంలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రాసే అన్ని స్టిక్కర్లను తొలగిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు