Haribabu, News18, Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ (Vemulawada) పట్టణ పరిధిలోని పలు పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా పొంచిఉన్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వేములవాడ పట్టణ శివారులోని పలు పంట పొలాల్లో గత కొన్ని రోజులుగా హై టెన్షన్ విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. పలుమార్లు విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే వెంటనే సెస్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయంపై పట్టణ సెస్ ఏఈ సుష్మా న్యూస్ 18తో మాట్లాడుతూ... ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణంలోని ఇనుప స్తంభాలను గుర్తించామని, అక్కడక్కడ శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తీసివేసి నూతన విద్యుత్ స్తంభాలను సైతం వేస్తున్నట్లు తెలిపారు.
వేములవాడ పట్టణంలోనూ ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా సెస్ సిబ్బందికి సమాచారం అందించాలని ఆమె సూచించారు. తమ తమ వార్డుల్లో ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే సెస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గుర్తించిన ప్రదేశాల్లో నూతన విద్యుత్ స్తంభాలు అమర్చినట్లు పేర్కొన్నారు. పంట పొలాల్లో తీగల గురించి రైతులు ఆందోళన చెందవద్దని త్వరితగతిన పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయిస్తామని, పూర్తిగా శిథిలావస్థకు స్తంభాలు చేరుకుంటే నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో ఇనుప స్తంభాలు తాక వద్దని విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న...సెస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే తాము ఉన్నట్లు ఏఈ వెల్లడించారు. ఇప్పటికే పట్టణంలోని వార్డులలో లూజ్ లైన్స్ సరి చేసి, నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. సెస్ సిబ్బంది ఎప్పటికప్పుడు వేములవాడ పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో సైతం పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు,లూజ్ లైన్స్ ఉన్నాయని, వాటిని సైతం పరిష్కరించాలని పలు మండలాలకు సంబంధించిన రైతులు కోరుతున్నారు. సెస్ జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాల వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Vemulawada