Haribabu, News18, Rajanna Sircilla
కార్తీక మాసం (Karthika Masam) కోసం ప్రముఖ శైవక్షేత్రాలు సిద్ధమవుతున్నాయి., తెలంగాణ (Telangana) లోని ప్రముఖ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం కార్తీక మాస ఉత్సవాలకు సిద్ధమైంది. కార్తీక మాసంలో నేపథ్యంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో (Vemulawada Rajanna Temple) ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. అక్టోబర్ 26 నుండి నవంబర్ 23 వరకు ఆలయంలో నిర్వహించే వివిధ పూజలను అర్చకులు, అధికారులు ఒక ప్రకటన ద్వారా భక్తులకు వెల్లడించారు. కార్తీక మాసం అన్ని సోమవారాల్లో రాజన్నగుడిలో,అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు.
ప్రతి సోమవారం ఆలయంలో ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 1 గంటకు రెండు పర్యాయాలు సత్యనారాయణ వ్రతాలను నిర్వహించనున్నారు. నవంబర్ 5న కార్తీక మాసం శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని ఉదయం 6.30 గంటలకు ఆలయ ఆవరణలోని శ్రీవిఠలేశ్వరస్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించి, సాయంత్రం 6.35 గంటలకు శ్రీకృష్ణ తులసీ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. నవంబర్ 6న శ్రీఅనంత పద్మనాభస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించి, ఉదయం 10.30 గంటల నుండి శ్రీ రాజరాజేశ్వరస్వామి, అన్ని ప్రధాన శివాలయాల్లో అన్నపూజలను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ అనంత పద్మనాభ స్వామి అభిషేకం చేసి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ చేసి పొన్నసేవ ఊరేగింపును నిర్వహిస్తారు.
8న కార్తీక పౌర్ణమిని సందర్భంగా చంద్రగ్రహణం ఉన్నందున సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలను నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసి ప్రదోశ కాల పూజను నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ఆవరణలో జ్వాలా తోరణాన్ని నిర్వహించి, రాత్రి నిశి పూజ అనంతరం శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి వారికి మహా పూజను నిర్వహిస్తారు.
కార్తీక మాసాంతం సాయంత్రం వేళలో కార్తీక పురాణ ప్రవచనాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో కృష్ణ ప్రసాద్ దేవస్థానం సిబ్బందిని ఆదేశించారు. దీపావళి పండుగ సందర్బంగా ఆలయాన్ని మామిడి తోరణాలతో, పుష్పాలతో, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో ఆలయం శోభయమానంగా కనువిందు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Vemulawada