(K. Haribabu, News18, Rajanna siricilla)
అతని వృత్తి కల్లు గీత (Toddy Worker). ప్రవృత్తి మాత్రం వ్యవసాయం. సీజన్లో కల్లు గీతతో జీవనోపాధి పొందుతున్న అతను, రైతుగానూ మారి..సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. సాంప్రదాయ వరి పంటను వదిలి..తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో సేంద్రియ పద్దతుల్లో కూరగాయల సాగు (Organic Farming) చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు ఆ రైతు. కూరగాయల సాగుతో ఏడాదిగా మంచి లాభాలు గడిస్తున్న రైతు లింబయ్య..తన అనుభవాలను తోటి రైతులతోనూ పంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాడు వ్యవసాయం దండగా అన్న పదానికి నేడు వ్యవసాయం పండగ అని నిర్వచనం ఇస్తున్న రైతు లింబయ్యపై (Limbaiah, farmer) "న్యూస్ 18" ప్రత్యేక కథనం.
ముఖ్యమంత్రి సూచనతో మారిన లింబయ్య ఆలోచన:
రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన నేరళ్ల లింబయ్య అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో కూరగాయల తోటలు వేశాడు. మొదటి నుంచి వ్యవసాయ కుటుంబమే అయినా, వృత్తి రీత్యా గీత కార్మికుడిగాను (Stripe worker) లింబయ్య జీవనం సాగిస్తున్నారు. లింబయ్య భార్య భాగ్యలక్ష్మి బీడీ కార్మికురాలు. ఇటు కల్లు గీత, అటు వ్యవసాయంతో లింబయ్యకు తోడుగా నిలుస్తున్నారు భాగ్యలక్ష్మి. రెండు ఎకరాల భూమిలో వరి సాగు చేస్తే రూ.30 నుంచి రూ. 40 వేలు మాత్రమే వచ్చేవి. 'పంట మార్పిడి చేయాలి రైతులు ప్రత్యామ్నాయ పంటల (Alternative farming) వైపు మొగ్గు చూపాలని' తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు లింబయ్య సైతం తన ఆలోచన మార్చుకుని కూరగాయల సాగు ఎంచుకున్నాడు. కూరగాయల సాగుపై పెద్దగా అవగాహన లేకపోయినా తన భార్య సహకారంతో ఆధునిక పద్ధతిలో వ్యవసాయం (FARMING) చేస్తూ..యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అనుకున్న దిగుబడి సాధించారు. లాభాలు తెచ్చుకుంటున్నాడు.
సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగు:
అందరు రైతుల్లా వరి, పత్తి, మక్క పంటలు వేయకుండా కేవలం కూరగాయల పంటలు వేశారు లింబయ్య. అధిక ఫలసాయం రావాలంటే రసాయన ఎరువులు, పురుగుమందులు వాడాల్సిన అవసరం లేదని, సేంద్రియ ఎరువులు వాడుతూ అధిక దిగుబడులు సాధించొచ్చని గ్రహించి ఆదిశగా ప్రయత్నాలు చేశారు. దీంతో రైతు లింబయ్య తాను అనుకున్న మేర ఫలితాన్ని సాధించి రోజుకు రూ. 5000 నుంచి రూ. 10,000 వరకు లాభాలు ఆర్జిస్తున్నాడు. రైతు లింబయ్య గురించి తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ జయంతి సైతం రైతును అభినందించారు. స్థానిక రైతులు సైతం లింబయ్య ద్వారా సూచనలు తెలుసుకుని పంట మార్పిడిపై దృష్టి పెడుతున్నారు.
లింబయ్య వేసిన కూరగాయల పంటలు:
ఈ ప్రాంతంలో పండే వరి, పత్తి, మొక్క జొన్న పంటలు కాకుండా కూరగాయలు పండించాలనుకొని వెంటనే టొమాటో, కాకర, బీర, సొరకాయ, వంకాయ, మిర్చి పంటలు వేసి, వీటికోసం ప్రత్యేకంగా మల్చింగ్ విధానం, పందిళ్లు, సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశామని అంటున్నారు. "రూ. నాలుగు లక్షల (Rs 4 lakh investment) పెట్టుబడి పెడితే, పంట కోతకు వచ్చే సమయానికి రోజుకు రూ. పది వేల (Rs. 10 thousand daily) వరకు లాభాలు వస్తున్నాయి. స్థానిక వ్యవసాయ అధికారులు సహకరిస్తే మున్ముందు మంచి పంటలు వేసి అధిక దిగుబడులు సాధిస్తా"నని అంటున్నాడు రైతు లింబయ్య.
ప్రోత్సాహకాలు ఇవ్వాలి: సర్పంచ్ రేఖ
లింబయ్య వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన సర్పంచ్ రేఖ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా పంట మార్పిడి విధానాన్ని అవలంబించి ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ వేసవిలో అత్యధికంగా లాభాలు గడించడం అభినందనీయమని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులందరూ లింబయ్య ఆదర్శంగా తీసుకొని ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. "వ్యవసాయ అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మట్టి యొక్క నాణ్యతను గుర్తించి ఏ మట్టిలో ఎలాంటి పంటలు వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందో రైతులకు తెలుపుతూ అవగాహన సదస్సులు నిర్వహించాలి" అని కోనరావుపేట గ్రామ సర్పంచ్ రేఖ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలను రైతులకు తగు సమయంలో అందిస్తామని భరోసా కల్పిస్తే రైతులు ఇతర పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతారని ఆమె తెలిపారు. రైతును రాజుగా చూడాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) కల నెరవేరుతుందన్నారు.
==========
నేరళ్ళ లింబయ్య.. 9490865008
కోనరావుపేట
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.