హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్మీ, పోలీస్ అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ శిక్షణ ఇస్తున్న కానిస్టేబుల్.. ఈయన సేవలకు సలాం కొట్టాలి..!

ఆర్మీ, పోలీస్ అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ శిక్షణ ఇస్తున్న కానిస్టేబుల్.. ఈయన సేవలకు సలాం కొట్టాలి..!

X
వేములవాడలో

వేములవాడలో కానిస్టేబుల్ సమాజసేవ

Vemulawada: రాజశేఖర్ గౌడ్.. తనకున్న సమయాన్ని వృధా చేయకుండా.. ఆర్మీ, పోలీస్ అభ్యర్థులకు ఉచితంగా ఫిజికల్ శిక్షణ ఇస్తున్నాడు. అతని శిక్షణలో పలువురు యువకులు ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R, India

Haribabu, News18, Rajanna Sircilla

పోలీస్ కానిస్టేబుల్ అంటే పోలీసు వ్యవస్థలోనే అతి చిన్న ఉద్యోగం. ఉన్నతాధికారులు ఎలా ఉన్నా కానిస్టేబుల్స్ మాత్రం 24 గంటలూ విధులను అంటిపెట్టుకుని ఉండాల్సిందే. దానికి తోడు చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తుంటారు. అయితేనేం తాము కూడా ప్రజా రక్షణలో భాగమేనని నమ్మి అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తుంటారు. ఇదే స్పూర్తితో ఓ పోలీస్ కానిస్టేబుల్ సామాజిక సేవ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ (Vemulawada) రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జీ.రాజశేఖర్ గౌడ్.. యువ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు.

రాజశేఖర్ గౌడ్.. తనకున్న సమయాన్ని వృధా చేయకుండా.. ఆర్మీ , పోలీస్ అభ్యర్థులకు ఉచితంగా ఫిజికల్ శిక్షణ ఇస్తున్నాడు. అతని శిక్షణలో పలువురు యువకులు ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మంది యువకులు ఆర్మీ, పోలీసులుగా ఉద్యోగాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. రాజశేఖర్ సేవలను గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు పురస్కారాలను అవార్డులను అందజేసి సత్కరించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సైతం యువ ఫౌండేషన్ ద్వారా రాజశేఖర్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు.

ఇది చదవండి: 30 ఏళ్లుగా పేద విద్యార్థులకు అండగా తన జీతంలో సగం సేవకే ఇస్తున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి

కరోనా విపత్కర సమయంలో సైతం పలు సేవా కార్యక్రమాలు, నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు, అన్నదానం చేసి అండగా నిలిచారు. వేములవాడ రాజన్న ఆలయం ఎదుట ఉండే యాచకులకు, అభాగ్యులకు, నిరుపేదలకు ఉచితంగా దుస్తులను, దుప్పట్లను పంపిణీ చేశారు. ఆస్పత్రిలో అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి వాలంటీర్ల సహాయంతో స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా ఇతర అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సామాజిక బాధ్యతను చాటుకుంటున్నాడు కానిస్టేబుల్ రాజశేఖర్.

ఇది చదవండి: మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మహాప్రభో.., కనీస సౌకర్యాలకు నోచుకోని గిరిజనులు

కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా అభాగ్యులు నిరుపేదలు ఉంటే తమ ఫౌండేషన్ దృష్టికి తీసుకొస్తే తమకు తోచినంత సహాయం అందించి అండగా నిలుస్తామని తెలిపారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను ఇతరులకు సేవ చేయాలనే దృక్పథంతో పోలీస్ శాఖలో చేరినట్లు తెలిపాడు. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు తన వంతు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. యువ ఫౌండేషన్‌ను సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్ +91 94930 03323.

First published:

Tags: Local News, Telangana, Vemulawada

ఉత్తమ కథలు