Haribabu, News18, Rajanna Sircilla
ఇటీవల కాలంలో దొంగలు పేట్రేగిపోతున్నారు. నగలు, డబ్బే కాదు పశువులను సైతం ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అలకుంట్ల రాములు తన గేదెను స్థానిక చల్ల బాల్ రెడ్డి పొలంలో కట్టేశాడు. మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్ళిన రాములు తిరిగివచ్చి చూసేసరికి తన గేదె కనిపించకపోవడంతో బాధితుడు లబోదిబోమని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులతో సహా గేదెను వెతికేందుకు వెళ్లారు. అదే సమయంలో గోరంటల గ్రామంలో గేదెను కొందరు వ్యక్తులు బొలెరో వాహనంలో తరలించడానికి ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన గ్రామస్థులు వారిని పట్టుకుని విచారించారు. అయితే ఇది మా అత్తగారు ఇచ్చిన గేద అంటూ దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. గ్రామ ప్రజలకు నమ్మకం కుదరకపోవడంతో అతన్ని, వాహనాన్ని ఫోటోలు తీశారు.
గేదను వెతుకుంటూ వచ్చిన రాములు గోరంటాల గ్రామంలో విచారించగా ఆ ఫోటోలను గ్రామస్థులు చూపించారు. వెంటనే పెట్రోల్ బంక్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించగా ఒక వ్యక్తి గేదెను తీసుకెళ్తున్నట్టు వీడియో రికార్డు చూసి ఆ గేదె తనదేనని నిర్ధారించుకున్న బాధితుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫోటోలు, వీడియోలను పోలీసులకు అందించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు TS 17 T 2343 అనే వాహనం మాచరెడ్డి చౌరస్తాకు చెందిన వాహనంగా గుర్తించారు. వాహనం యజమానికి ఫోన్ చేయగా స్టేషన్కు వచ్చి జరిగింది వివరించారు.
దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బుర్జుకాడి నర్సాగౌడ్, ముద్దం స్వామి ఇద్దరు వ్యక్తులు తమ వద్దకు వచ్చి తమ అత్తగారు ఇచ్చిన గేదెను గోరింటల గ్రామ శివారులో ఉంచామని, దాన్ని స్వగ్రామమైన ముత్యంపేటలో దించేందుకు బొలెరో వాహనం కిరాయికి మాట్లాడినట్టు వారు వివరించారు. అందుకు గానూ రూ. 1000 ఇచ్చి వాహనంలో గేదెను ముత్యంపేటలో విడిచి పెట్టామని యజమాని చెప్పాడు.
వాహనం ఓనర్ వద్ద నుండి నిందితుల ఫోన్ నెంబర్లు సేకరించి నిందితులను పట్టుకొచ్చి విచారించగా గేదెను దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన ఎస్సై బొజ్జ మహేష్ పలు కోణాల్లో విచారిస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. గేదెను దొంగతనం చేసిన దుండగులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగలను పట్టుకున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు బాధితుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Local News, Telangana