హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: సీజన్ ‌తో సంబంధం లేకుండా పూల సాగు చేస్తున్న రైతులు.. లాభాలు ఎలా ఉన్నాయంటే.?

Rajanna Siricilla: సీజన్ ‌తో సంబంధం లేకుండా పూల సాగు చేస్తున్న రైతులు.. లాభాలు ఎలా ఉన్నాయంటే.?

రాజన్న

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాభసాటిగా పూలసాగు

ఆ గ్రామంలో అధిక శాతం వ్యవసాయమే వృత్తిగా జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న కుటుంబాలన్నాయి. అయితే ఇతర రైతుల్లా వాణిజ్య పంటలకే పరిమితం కాకుండా కూరగాయలు, పూల తోటల ద్వారా అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  ఆ గ్రామంలో అధిక శాతం వ్యవసాయమే వృత్తిగా జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న కుటుంబాలన్నాయి. అయితే ఇతర రైతుల్లా వాణిజ్య పంటలకే పరిమితం కాకుండా కూరగాయలు, పూల తోటల ద్వారా అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కోనరావుపేట మండలంలోని మంగళ్లపల్లి గ్రామంలో 190-200 వరకు రైతు కుటుంబాలున్నాయి. వీరిలో సుమారు 50 - 60 కుటుంబాలు బంతి, చామంతి, మల్లెపూల తోటల పెంపకంతో మంచి లాభాలు పొందుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పూల సాగు చేస్తామని రైతు సాసాల రాజిరెడ్డి తెలిపాడు. వీటిని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల , ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) ప్రాంతాలతో పాటు కరీంనగర్ మార్కెట్ కూడా తరలిస్తామని వివరించాడు.

  పూల సాగుతో మంచి లాభాలు: నిత్యం 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు పూలు విక్రయిస్తామని, శుభకార్యాలు (వివాహాలు,మల్లన్న పట్నాలు,బతుకమ్మ,దపావళి) పండుగల సమయాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కిలోకు రూ.50 నుంచి రూ. 75 వరకు ధర పలుకుతుండగా దసరా, బతుకమ్మ, దీపావళి తదితర ప్రత్యేక రోజుల్లో రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తామన్నారు. పూలు, కూరగాయల సాగుతో వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు, పత్తిసాగు పెట్టుబడికి వినియోగిస్తామని రైతులు చెబుతున్నారు. పూల విత్తనాలపై ప్రభుత్వం రాయితీపై ఇస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: ఈ ఆవుపాలు తాగితే మోకాళ్ల నొప్పులు మటుమాయం.. ఎక్కడ దొరుకుతాయో తెలుసా..?

  కూరగాయల సైతం పండిస్తూ: పూలు, కూరగాయలు పండించడం ద్వారా రోజువారి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయని రైతులు అన్నారు. గతంలో రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో మార్కెట్ వరకు వెళ్లాలంటే ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలు పెరిగిన నేపథ్యంలో ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి పూలు, కూరగాయలను తరలించడం సులభతరమైందని రైతులు తెలిపారు. రవాణా వ్యయం కూడా తగ్గడంతో చేతిలో డబ్బులు మిగులుతున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి పూలను కొనుగోలు చేస్తారని రైతులు చెబుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పూజల కోసం ఇక్కడి నుంచే వివిధ రకాల పూలను సరఫరా చేసేవారమని రైతులు చెబుతున్నారు.

  మంగళ్లపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా 40 నుంచి 50 ఎకరాల వరకు రైతులు పూల తోటలను సాగు చేస్తున్నారు. దీంతో గ్రామ శివారు ప్రాంతాలన్నీ రంగురంగుల పూలతో స్వాగతం పలుకుతున్నాయి. గ్రామం పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది. మహా శివరాత్రి జాతర, సమ్మక్క సారలమ్మ జాతరలకు ముందుగా వేములవాడ రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో.. భక్తులు సైతం అధిక మొత్తంలో పూలను కొనుగోలు చేస్తున్నారని దీంతో మంచి లాభాలు రావడం.. పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వేములవాడ నియోజకవర్గంలోనే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో సైతం రైతులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Flowers, Karimangar, Local News, Telangana

  ఉత్తమ కథలు