RAJANNA SIRCILLA THE VEMULAWADA AREA GOVERNMENT HOSPITAL HAS GROWN TO THE CORPORATE LEVEL AND DELIVERIES HAVE ALSO INCREASED RKH BRV PRV
Rajanna sircilla: కార్పొరేట్ హాస్పిటల్‌ను తలదన్నేలా ఆ ప్రభుత్వ ఆసుపత్రి.. ఒక్కసారిగా పెరిగిన సహజ కాన్పులు
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పెరిగిన సహజ కాన్పులు, మంత్రుల అభినందన
ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ కాన్పులు అరికట్టి, సహజ కాన్పులు పెంచాలన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సూచనల మేరకు ఏరియా ఆసుపత్రి వైద్యులు గర్భిణీ స్త్రీలకు విధిగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పరంగా ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యాల్లో విద్యా, వైద్యం ముందు వరుసలో ఉంటాయి. అయితే కొన్ని కారణాల వలన ప్రభుత్వాసుపత్రుల్లో (Government Hospital) వైద్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. దీంతో సామాన్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి మారింది. ఏరియా ఆసుపత్రుల్లోనూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుబాటులోకి వచ్చింది. అధునాతన వైద్య పరికరాలతో ప్రభుత్వాసుపత్రుల్లోనే శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు వైద్యులు. తెలంగాణ రాష్ట్రం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆస్పత్రి ( Vemulawada area government hospitalలో విజవంతంగా శస్త్రచికిత్సలు (Surgeries) చేస్తున్నారు వైద్యులు. అంతే కాదు గర్భిణీ స్త్రీలకు సహజ కాన్పుల (Deliveries) పట్ల అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడి వైద్యులు.
ఏరియా ఆసుపత్రిలో పెరిగిన సహజ కాన్పులు..
ఏరియా ఆసుపత్రిలోనూ.. నియోజకవర్గం పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాల సేవలు వినియోగించుకుంటున్న స్థానిక గర్భిణీ స్త్రీలకు (Pregnant) ఇక్కడి వైద్యులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం మహిళా డాక్టర్ల నేతృత్వంలో గర్భిణీలకు అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల వ్యాయామాలు చేపడుతున్నారు. తద్వారా ఏరియా ఆసుపత్రిలో సహజ కాన్పుల (natural Deliveries) సంఖ్య పెరిగిందని వైద్యురాలు వివరించారు. అదే విధంగా ప్రభుత్వాసుపత్రిలో కాన్పు కోసం వచ్చే వారికి పలురకాల ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు ఇక్కడి వైద్యులు. మొదటి కాన్పు నార్మల్ డెలివరీలో ఆడబిడ్డ జన్మిస్తే వారికి ఊయలను బహుమతిగా ఇస్తున్నామని ఆసుపత్రి సూపరిండెంట్, వైద్యులు పేర్కొన్నారు. అలా ఇప్పటి వరకు 10 మంది పసిబిడ్డలకు ఊయల అందించారు. నార్మల్ డెలివరీల పట్ల నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, వ్యాయామాలకు హాజరైన అనంతరం జరిగిన 19 కాన్పుల్లో 17 మంది గర్భిణీలకు నార్మల్ డెలివరీ అయినట్లు వైద్యులు వివరించారు.
మంత్రుల అభినందన, స్థానికుల సంతోషం..
ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ కాన్పులు అరికట్టి, సహజ కాన్పులు పెంచాలన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సూచనల మేరకు ఏరియా ఆసుపత్రి వైద్యులు గర్భిణీ స్త్రీలకు విధిగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు, సహజ కాన్పులు పెరగడంపై మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రమేష్ బాబు ట్విట్టర్ వేదికగా వైద్యులను అభినందించారు. ఇక స్థానికంగా అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి అందుబాటులోకి రావడం, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సహకారంపై వేములవాడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు..
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. సుమారు రూ. 22 కోట్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించిన ఈ ఆసుపత్రిని గతేడాది ఏప్రిల్ లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించిన వేములవాడ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్సలు కూడా పూర్తి చేశారు వైద్యులు. జిల్లా కేంద్రంలోని ఈ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ద్వారా మోకాల మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు అనిల్ కుమార్, మహేష్ రావుల బృందం విజయవంతం చేసి ప్రభుత్వ ఆసుపత్రి పట్ల విశ్వసనీయతను పెంచుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇటీవల పలువురు వృద్ధులకు మోతిబింద్ కంటి ఆపరేషన్ సైతం విజయవంతం చేసి ఏరియా ఆస్పత్రి కార్పొరేట్ వైద్యానికి ఏమాత్రం తీసిపోదని నిరూపించారు ఇక్కడి వైద్యులు.
ఈ సందర్భంగా వైద్యులు న్యూస్ 18 ప్రతినిధితో మాట్లాడుతూ.. వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ ఏరియా ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల అధునాతన సౌకర్యాలతో ఏరియా ఆసుపత్రి సంవత్సర కాలంగా సేవలందిస్తుందని వివరించారు. ప్రజలందరూ వంద పడకల ఏరియా ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Area Hospital, Vemulawada
Thippapur, Vemulawada,
District: రాజన్న సిరిసిల్ల
Mobile No:9490510308
Gmail: ahvemulawada@gmail.com
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.