K.Haribabu, News 18, Rajannasircilla
Rajannasircilla; వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి వరి, పత్తి పంట పూర్తిగా నాశనం అయింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఇసుకమేటలు వేశాయి. ఈ ఏడాది తమ పెట్టుబడి వచ్చేలా లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్లో రైతులు 1,10,840 ఎకరాల్లో వరి, 62,983 ఎకరాల్లో పత్తి, 2,154 ఎకరాల్లో కంది, పెసర, మొక్క జొన్న పంటలు వేశారు.
వరుస వర్షాలతో బోయినపల్లి(Boianpally), రుద్రంగి(Rudrangi), వేములవాడ (Vemulawada) రూరల్ మండలాల్లో 122 మంది రైతులకు చెందిన 200 ఎకరాల్లో వరి పత్తి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మెజార్టీగా బోయినిపల్లి మండలంలో 132 మంది రైతులకు చెందిన 170 ఎకరాలలోని పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వేములవాడ రూరల్ మండలంలోని 20 మంది రైతులకు చెందిన 20 ఎకరాల్లో, రుద్రంగి మండలంలో 10 ఎకారాల్లో ఇసుక మేటలు వేశాయని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
జిల్లాలో ఆగష్టు 17వరకు వేసిన పంట పొలాలు వివరాలు: వరి పంట: 1,10,840 ఎకరాలు; పత్తి పంట: 62,983 ఎకరాలు; కందులు: 1295 ఎకరాలు; మొక్క జొన్న: 807 ఎకరాలు; పెసర:52 ఎకరాలు
రెండు ఎకరాల పత్తి పంట నీట మునిగింది: రైతు ఆవేదన
పంట నష్టం పై పలువురు రైతులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. "రెండు ఎకరాల్లో పత్తి పంట వేశానని, నిరంతరం కురుస్తున్న వర్షాలకు నీట మునిగి పంట నాశనం అయిందని" వేములవాడకు చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక జిల్లాలో పంట నష్టంపై జిల్లా వ్యవసాయశాఖ అధికారులు స్పందించారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని డీఏవో రణధీర్ కుమార్ తెలిపారు. నష్టపోయిన పంట పొలాల సంబంధించిన వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో 122 రైతులకు చెందిన 192 ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంపై నివేదిక ఇస్తున్నట్లు డీఏఓ పేర్కొన్నారు.
Read this also; Rajanna Sircilla: రైతులకు కడుపుకోత మిగిల్చిన వర్షాలు: వేల ఎకరాల్లో పంట నష్టం
ప్రభుత్వం స్పందించాలి: రైతులు
మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌లు వెంటనే స్పందించి అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిష్కారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పంట పెట్టుబడిగా అధిక మొత్తంలో వెచ్చించి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా అధిక వర్షాలు కారణంగా జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Heavy Rains, Sircilla, Telangana