RAJANNA SIRCILLA TELUGU PERSON RAMKUMAR THOTA WHO ONCE ROAMED THE ROADS OF DUBAI IS NOW DRIVING A ROLLS ROYCE CAR RKH NJ PRV
Success story: దుబాయ్ రోడ్ల మీద కాలినడకన తిరిగిన తెలుగు వ్యక్తి.. ఇపుడు రోల్స్‌రాయిస్ కారులో .. ఎవరా వ్యక్తి ? ఏమిటా కథ?
తోట రామ్‌కుమార్
అతనిది మధ్యతరగతి కుటుంబం..ఉపాధి కోసం (గల్ఫ్)ఎడారి బాటపట్టాడు. ఇప్పుడు వంద కోట్లు సంపాదించి దుబాయ్‌లోని బిగ్షాట్స్ లో ఒకరిగా ఎదిగారు. అప్పట్లో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి మెటీరియల్ సరఫరా చేశాడు మన తెలుగోడు తోట రామ్‌కుమార్..!
దుబాయ్ (Dubai) రోడ్లమీద కాలి నడకన తిరిగినా.. అదే రోడ్లపై ఖరీదైన రోల్స్‌రాయిస్ (Rolls-Royces) కారులో తిరిగే స్థితికి ఎదిగాడు. ఆయన ఎవరో కాదు.. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా..ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన తోట రామ్‌కుమార్ (Thota Ramkumar). దుబాయ్‌లోని రూ. 680కోట్ల వ్యాపారం గల‘ఎస్సారార్ బీఎంటీ’(SRRBMT) కంపెనీకి అధిపతి.
కరీంనగర్ (Karimnagar) జిల్లా వేములవాడలో మధ్య తరగతి కుటుంబంలో రామ్ కుమార్ పుట్టాడు. ఆయనకు తోట నారాయణ, నర్సమ్మ తల్లిదండ్రులు. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తే తప్ప ఇల్లు గడిచేది కాదు.. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అప్పట్లో చదువులు పెద్దగా చదువుకోలేదు. 2వసారి ఏదోలా పదో తరగతి పాస్ అయ్యాడు. ఆ సమయంలో యువత చూపు గల్ఫ్ వైపు ఉండేది. రామ్‌కుమార్ కూడా వెళ్దామనుకున్నాడు. రెండు జతల బట్టలు, 10వతరగతి మెమో పట్టుకొని దుబాయ్ పయనమయ్యాడు.
దుబాయ్‌లో చార్టెడ్ ఎకౌంటెన్సీ
1989లో దుబాయి (Dubai) చేరుకొని, ఓ కంపెనీలో అకౌంట్స్ అసిస్టెంట్‌గా పనిలో చేరాడు. రోజులు గడుస్తున్నా అక్కడ ఎలాంటి ఎదుగుదల లేకపోవటంతో ఉన్నత చదువులు చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అకౌంటింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్‌లలో నైపుణ్యాలను ఎంతో ఓర్పుతో నేర్చుకుని.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే, సీఏ పరీక్షలకు సిద్ధం అయ్యాడు. పట్టుదలతో చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసి కష్టపడితే కానిది ఏముండదని నిరూపించాడు. ఆ తర్వాత ఆదానీ గ్రూప్ (Adani groups)లో సేల్స్ డైరెక్టర్ (sales Director)గా ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
రామ్ జీవితాన్ని మార్చేసిన ఆదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌లోని పెట్రో కెమికల్ విభాగం అధిపతి యోగేష్ మెహతా ప్రోత్సాహంతో వేములవాడ రామ్ కుమార్ లైప్ టర్న్ అయిందని చెబుతున్నాడు. మెహతా నుంచి రామ్ ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, తనకు తానే కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకున్నట్లు తెలిపాడు. యూఏఈలోని(UAE) పలు కంపెనీల సేల్స్ డైరెక్టర్లతో పరిచయం ఏర్పడింది. సేల్స్ డైరెక్టర్స్ గ్రూప్‌లోనూ చోటు సంపాదించాడు. మొక్కవోని దృఢ సంకల్పంతో వ్యాపార రంగాన్ని ప్రారంభించాడు.
సరికొత్త వ్యాపార రంగంలో తొలి అడుగు
కూడబెట్టిన డబ్బులతోపాటు బ్యాంకుల నుంచి రుణం కూడా తీసుకొని 2004లో ‘టోటల్ సొల్యూషన్స్’ పేరుతో దుబాయ్‌లోనే ఒక కంపెనీని ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఊహించిన దానికంటే గొప్పగా వ్యాపారం సాగింది. 2007లో బిజినెస్ భాగస్వామ్యులతో విడిపోవాల్సి వచ్చింది. సొంతంగా వ్యాపారం చేయడమే తన ముందున్న ఏకైక మార్గంలా కనిపించింది.
శ్రీరాజరాజేశ్వర బిల్డింగ్ మెటీరియల్ ట్రేడింగ్ ప్రారంభం
తోట రామ్ కుమార్ ఏమాత్రం కుంగిపోకుండా ఏమీ లేని వారికి ఆ దేవుడే దిక్కు .. అన్న మాటలను గుర్తు తెచ్చుకున్నాడో ఏమో కానీ.. దక్షిణ కాశీగా అలరారుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మనసులో తలచుకుని శ్రీరాజరాజేశ్వర బిల్డింగ్ మెటీరియల్ ట్రేడింగ్ (SRRBMT)’ని ప్రారంభించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కంపెనీల్లో రామ్ కుమార్ కంపెనీ రెండోస్థానంలో ఉంది. గల్ప్ కో-ఆపరేషన్ కౌన్సిల్ టాప్ బిలియనీర్ కంపెనీల జాబితాలో 23వ ర్యాంకులో నిలిచింది SRR కంపెనీ.
విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం
దుబాయ్ తర్వాత చైనాలోనూ (China) ప్రారంభించారు వ్యాపారం. ఒమన్‌లోనూ తన సంస్థ కోసం ఒక బ్రాంచ్‌ను ప్రారంభించారు. Midel este దేశాలకు భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసే టాప్ డీలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్ సభ్యుడిగానూ (Member of the Consulate) గౌరవం దక్కించుకున్నారు తోట రామ్‌కుమార్.
రామ్ కుమార్ మెటీరియల్ సరఫరా చేసిన గొప్ప భవంతులు
ప్రఖ్యాత బుర్జ్‌ఖలీఫాతో (Burj Khalifa) పాటు మొహమ్మద్ బిన్ రషీద్ సిటీ, అల్ మక్టౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు,అరేబియన్ రాంచెస్, స్పోర్ట్స్ సిటీ, మోటార్‌సిటీ, దుబాయ్ మాల్, ఫామ్ జుమేరా బిజినెస్ బే... వీటన్నిటికీ భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసింది ఎస్ఆర్ఆర్.బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం ఇది.. ఇలాంటి నిర్మాణానికి మెటీరియల్ సరఫరా చేసే అవకాశం రావడం అదృష్టం అని, అది తన జీవితంలో మరపురాని అనుభూతి అని తోట రామ్‌కుమార్ అన్నారు.
వ్యాపారంతో పాటు సమాజసేవ
బతకడమంటే మనం ఒక్కరమే బతకడం కాదు బిడ్డా!.. మనతోపాటు మరో నలుగుర్ని బతికించడం అని నాన్న చెప్పిన మాటలే స్ఫూర్తిగా సమాజసేవలోనూ ముందుకు సాగుతున్నారు రామ్‌కుమార్. వేములవాడలో ‘టీఆర్కే ట్రస్టు’ (TRK trust)ను ప్రారంభించారు. సొంతూరితోపాటు పలు గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుట్టిన నేలకు ఏదైనా చేయాలనే గొప్ప ఆశయంతో ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తోట రామ్ కుమార్ తెలిపారు. ట్రస్టు ద్వారా పేద నిరుపేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే పేరు ప్రఖ్యాతలు ఆస్తులు అంతస్తులు సాధించినట్లు తెలిపాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తోట రామ్ కుమార్ ది అని అతని స్నేహితులు చెబుతున్నారు. 14 సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయమైన బతుకమ్మ పండుగలు దుబాయ్‌లో ఘనంగా తన సొంత ఖర్చులతో నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.