Home /News /telangana /

RAJANNA SIRCILLA TELANGANA SINGER MARUTI WANTS THE AUDIENCE TO WIN AS THE TELUGU INDIAN IDOL WINNER SNR KNR

Telugu Indian Idol: సింగర్‌గా సిరిసిల్ల కుర్రాడు..ఫైనల్‌లో గెలిపించాలంటున్న మారుతి

(మట్టిలో మాణిక్యం)

(మట్టిలో మాణిక్యం)

Telugu Indian Idol:రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మారుతి గానగాంధర్వుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‌లో అద్భుతమైన టాలెంట్ ప్రదర్శిస్తూ ముందు దూసుకెళ్తున్నాడు. ఫైనల్ విన్నర్‌గా గెలిచే వరకు తనకు ఓట్ చేసి ప్రోత్సహించమని కోరుతున్నాడు రాజన్నసిరిసిల్ల జిల్లా యువకుడు.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)
  మధురమైన స్వరమే అతని ఆస్తి. గాయకుడ్ని కావాలన్న పట్టుదల, గాన సరస్వతినే నమ్ముకొని చేస్తున్న ప్రయత్నం అతడ్ని ప్రముఖ గాయకుడిగా మార్చేసింది. తెలంగాణ(Telangana)రాష్ట్రం రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla)జిల్లా గంభీరావుపేట(Gambhiraupeta) మండలం లింగన్నపేట(Lingannapeta)అనే పల్లెటూరులోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కొడిమోజు మారుతి(Kodimoju Maruti)ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol) పోటీల్లో తన సత్తా చాటుకున్నాడు. బిగ్గెస్ట్ మ్యూజిక్ షోలో..వేలాది మంది గాయలతో పోటీ పడి 12మందిలో ఒకడిగా సెలక్ట్ అయ్యాడు. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. సంగీత నేపధ్యంలో ఉన్న కుటుంబం అంతకన్న కాదు. ప్రోత్సహించే వాళ్ల కంటే నిరుత్సాహపరిచిన వాళ్లు, నీ వల్లే ఏమవుతుందిలే అని తక్కువ చేసిన మాటలను సైతం భరిస్తూ తన లక్ష్య సాధనలో ముందుకెళ్లాడు మారుతి. పాటలు పాడటం, సింగర్‌ కావాలనే బలమైన కోరితతో సొంత ఊరు, అయిన వాళ్లందరిని వదులుకొని చివరకు ఓ హోటల్‌లో బెరర్‌గా చేరాడు. చాలి చాలని జీతం, అనుకున్నది సాధించాలనే పట్టుదల ముందు సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, కష్టాల్నిఒక్కొక్క మెట్టుగా మార్చుకొని తన ఎదుగుదలకు బాటలు వేసుకున్నాడు మారుతి. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మారుతి..ఆ తర్వాత తండ్రి చనిపోవడం, కుటుంబ భారాన్ని అన్నయ్యలు మోయడంతో వారికి భారం కాకూడదని హైదరాబాద్‌ వచ్చాడు.

  సింగర్‌ కావాలనే..
  హైదరాబాద్‌లోని ఓ హోటల్ , రెస్టారెంట్ లో పనిచే సేటప్పుడు కాస్త టైం దొరికితే చాలు పాటలు ప్రాక్టీస్ చేసేవాడు. తన గానామృతంతోనే తోటి పని వాళ్ల దగ్గర మన్ననలు పొందిన మారుతి ఆ తర్వాత రఘు అనే స్నేహితుడు ద్వారా మ్యూజిక్ ప్రాక్టీస్‌కి బాలసుబ్రమణ్యానికి దగ్గరయ్యారు. ఆయన బేసిక్స్ నేర్పించడంతో గాయకుడ్ని అవుతానన్న సంకల్పం మరింత బలపడింది. ఉదయం సంగీతం, మధ్యాహ్నం కార్పెంటర్ వర్స్, సాయంత్రం రెస్టారెంట్ లో పని చేస్తూ వచ్చాడు మారుతి. ఇలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ వచ్చిన మారుతి సింగర్‌గా అకాశం వస్తుందనే ఆశతో ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ మెటీరియల్ మోసేందుకు కూడా ఇష్టపడ్డాడు. చివరకు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసేందుకు సెలక్ట్ కావడం అందులో కూడా తెలంగాణ నుంచి మారుతి ఒక్కడే ఉండటం ఇంకా గొప్ప విషయంగా చెప్పుకోవాలి.

  (ఇండియన్ ఐడల్ సింగర్‌)


  పట్టుదలతోనే ..
  సింగర్‌ కావాలన్న తపనతో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే పాడుతాతీయగా ప్రోగ్రామ్‌ చూస్తూ సంగీతంలో మెళకువలు, సరిగమలు, ఓనమాలు నేర్చుకున్నాడు మారుతి. మారుతికి తెలుగు ఇండియన్ ఐడల్ గొప్ప వేదికగా మారింది. వేలాది మంది కాంపిటేషన్‌ని తట్టుకొని సెలక్ట్ కావడంతో పాటు ఇప్పటి వరకు 18 ఎపిసోడ్స్‌ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇందులో ఏ పాట పాడిన జడ్జీల నుంచి వచ్చిన ఆదరణ, ప్రశంసలు తాను మరింత గొప్పగా పాడేందుకు దోహదపడ్డాయని సింగర్ మారుతి తెలిపాడు. ప్రత్యేకించి అమ్మో నీయమ్మ గొప్ప .. " పాట పాడినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నన్ను హగ్ చేసుకున్న విషయాన్ని మర్చిపోలేనంటున్నాడు. మరో జడ్జి, సింగర్ కార్తీక్ , నిత్యామేనన్ తన స్వరాన్ని ఎంతగానో మెచ్చుకున్నారని..తనకు బెస్ట్ ఫ్యూచర్ ఉందని చెప్పినప్పుడు గొప్ప అనుభూతినిచ్చిందన్నాడు. తన పుట్టిన రోజును అమ్మ సమక్షంలో జరుపుకోవడం ఎప్పటికి మర్చిపోలేనన్నాడు.

  కష్టాల్ని ఎదురీదుతూ..
  ఇంతింతై..వటుడింతై అన్న చందంగా మారుతి గాన ప్రయాణం ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ప్రతి నెల పాటల పోటీల తర్వాత ఓటింగ్ విధానంలో ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నారు. అంటే మరో 10నెలల్లో నెంబర్ వన్ సింగర్‌గా ఒకరే ఉంటారు. గాయకుడ్ని కావాలనే పట్టుదలతో వచ్చిన మారుతిని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు అతనికి ఓట్ చేసి గెలిపించాలని సొంత జిల్లా ప్రజలతో పాటు చాలా మంది సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. అటు మారుతి కూడా అందర్ని సంతోషపెట్టే విధంగా తాను పాటలు పాడతానని అందుకోసం ప్రతి ప్రేక్షకుడు తనకు ఓట్ చేస్తూ సపోర్ట్‌ ఇవ్వాలని కోరుతున్నాడు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Indian Idol season 12, Karimnagar

  తదుపరి వార్తలు