Srinivas Ponnam, News18, Karimnagar
తెలంగాణ (Telangana) లో అమలవుతున్న పథకాలపై ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా తెలంగాణ పథకాలు (Telangana Government Schemes) బాగుతున్నాయని ప్రశంసిస్తున్నారు. తాజాగా తమిళనాడు (Tamil Nadu) కు చెందిన ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారు. ఆ పథకాలు అమలవుతున్న తీరును తెలుసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల బృందం గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. తమిళనాడు ఎమ్మెల్యేలు సింతనాయి సెల్వన్, ఎస్‌ఎస్ బాలాజీ తో పాటు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ రిచర్డ్ డెవడస్, మురుగప్పన్, డాక్టర్ వీఏ రమేశ్ నాథన్ కరీంనగర్ లో పర్యటించగా.. వారిని మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు.
దళితబంధు, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం తెలంగాణలో పర్యటిస్తున్నామని మంత్రికి తమిళనాడు ఎమ్మెల్యేలు చెప్పారు. అనంతరం ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి గంగుల కమలాకర్‌ని అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు గురించి సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యేలు.. ఈ పథకంపై ప్రశంసలు కురిపించారు. దళిత సాధికారత కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.
దళిత బంధుతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి గంగుల కమలాకర్‌ని తమిళనాడు ఎమ్మెల్యేలు అభినందించారు. అంతేకాదు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిలో పంటలు సాగుచేస్తూ.. లబ్ధి పొందుతున్న దళితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్దకు వెళ్లి.. దళిత బంధు గురించి అడిగారు. ఈ పథకం తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యేల బృందం.. చొప్పదండి మండలం రుక్మపూర్ లోని సైనిక స్కూల్ ను సందర్శించింది. వారి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులున్నారు. అక్కడి నుంచి రామడుగు మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరానికి వెళ్లారు. కళ్ల పరీక్షల తీరును.. చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్‌తో కలిసి పరిశీలించారు. అక్కడ వారు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ పథకం ఎంతో బాగుందని కొనియాడారు. తమిళనాడు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ కళ్లద్దాలను అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Local News, Telangana