Srinivas Ponnam, Karimnagar, News18
వారు ఉన్నత చదువులు చదివారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారికి దానిలో సంతృప్తి లేక స్వగ్రామానికి చేరుకొని వారికి ఉన్న ఐదు ఎకరాల భూమిలో ఆధునిక పద్ధతిలో పూల సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతు దంపతులు. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగ్ జిల్లా (Karimnagar District) జంగపల్లి గ్రామానికి చెందిన కర్ర శ్రీకాంత్ రెడ్డి, అనూష దంపతులు, శ్రీకాంత్ రెడ్డి డిగ్రీ పూర్తి చేయగా అనూష రెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. వీరు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినప్పటికీ కరోనా కష్టకాలంలో కొంత ఒడిదుడుకులు ఎదురు కావడంతో స్వగ్రామానికి చేరి వర్క్ ఫ్రం హోం పద్ధతిలో విధులు నిర్వహిస్తూ వారి భూముల వ్యవసాయం చేయాలని సంకల్పించుకున్నారు.
సాంప్రదాయ పంటలు కాకుండా ఆధునిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఒక ఎకరం గులాబీ తోట, ఎకరం చామంతి తోట, ఎకరం లిల్లీ తోట, ఎకరం బంతి తోట, ఎకరం కుసుమ పంటను సాగు చేశారు. ప్రతిరోజు మూడు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతూ పలువురు కూలీలకు ఉపాధిని కల్పిస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే వీరు ఆదర్శ రైతులుగా గుర్తింపబడి ఈనెల 17వ తేదీన కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉత్తమ రైతు దంపతులుగా అవార్డు అందుకోనున్నారు.
గులాబీ ,చామంతి, బంతి సాగుకై మల్చింగ్ విధానాన్ని ఉపయోగిస్తూ, డ్రిప్ ద్వారా పంటకు నీటిని అందిస్తున్నారు. చామంతి తోటను చలినుండి రక్షించుటకై తోటలో ప్రత్యేక విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసి పంటకు వెచ్చదనాన్ని అందజేస్తూ కాపాడుతున్నారు. హార్టికల్చర్, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ లాభాలను అర్జిస్తున్నారు.
"మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఆధునిక పద్ధతులు అవలంబించి తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రయోగాత్మకంగా ఈ విధమైన సాగును మేము చేస్తున్నాం. తొలి ప్రయత్నం లోనే మేము సక్సెస్ అయ్యాం రైతులు ప్రత్యామ్నాయ పంటల ముందుకు రావాలి. దేశానికి అన్నం పెట్టే రైతు ఆర్థికంగా ఎదగడానికి ఈ ప్రత్యామ్నాయ పంటలు ఎంతో దోహదపడతాయి" అని దంపతులు చెబుతున్నారు.
జిల్లాలోనే ప్రయోగాత్మకంగా కుసుమ పంటను జంగపల్లి గ్రామంలో కర్ర శ్రీకాంత్ రెడ్డి అనూష దంపతులచే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగు చేపిస్తున్నాం. కుసుమ పంటతో లాభాలు అధిక మొత్తంలో పొందవచ్చు. ఈ పంట సాగుకు చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది. చీడపీడల బెడద ఉండదు. పశువులు, పందులు, కోతులు ఈ పంటను తినడం జరగదు. కుసుమలు ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తాయి. క్వింటాలు కుసుమల ధర రూ.5000 నుండి 6000 వరకు మార్కెట్ విలువ ఉంటుంది. నీటి ఎద్దడి ప్రదేశాల్లో అతి తక్కువ నీటితో ఈ పంటను పండించవచ్చు.
కుసుమ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. కుసుమ నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని పశువుల దాణాగా వినియోగించవచ్చు. పూల తోటల్లో తేనెటీగల పెంపకం ఎంతో లాభదాయకం. పూల తోటల పెంపకంతో పాటు అదనంగా తేనెటీగల పెంపకం చేపట్టినట్లయితే తేనె ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. తేనెటీగల ద్వారా పూలు పండ్ల తోటల్లో పరపరాగ సంపర్కం అధికంగా జరిగి పండ్ల తోటల్లో అధిక దిగుబడి వస్తుంది. ప్రత్యామ్నాయ పంటలు, ఔషధ పంటలో సాగుకు రైతులు ముందుకు రావాలని వ్యవసాయ అధికారిని ఏవో కిరణ్మయి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Karimnagar, Local News, Telangana