Home /News /telangana /

RAJANNA SIRCILLA SIRCILLA HANDLOOM WORKER MADE A SAREE THAT SPREADS SCENT HE USED 27 TYPES OF SCENTS IN THIS ABH BRV RKH

Rajanna Sircilla: పరిమళాలు వెదజల్లే పట్టుచీర... చేనేత కార్మికుడి అద్భుత ప్రతిభ

పరిమళించే

పరిమళించే పట్టు చీరను తయారు చేసిన చేనేత కార్మికుడు నల్ల విజయ్

నేతన్న విజయ్... తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు సైతం అందుకున్నాడు. ఇటీవల 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరను తయారుచేసి మరోమారు తనలోని ప్రతిభను చాటిచెప్పారు విజయ్.

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    కళాత్మక ఆలోచన ఉండాలేగాని... మనకు నచ్చిన ఏ రంగంలోనైనా ఇట్టే రాణించవచ్చు. ఈ సత్యాన్ని అక్షరాలా నిజం చేస్తూ తనలోని ప్రతిభను (Talent) వెలికితీసాడు ఓ చేనేత కళాకారుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు(Handloom worker) నల్ల విజయ్... చీరలు నేయడంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వెండి కొంగుతో, అరటి, తామర నారుతో పట్టు చీరలు తయారు చేసి అబ్బురపరిచిన నేతన్న విజయ్. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు సైతం అందుకున్నాడు. ఇటీవల 27 సుగంధ ద్రవ్యాలతో (spices) పరిమళించే పట్టుచీరను తయారుచేసి మరోమారు తనలోని ప్రతిభను చాటిచెప్పారు విజయ్.

    పరిమళించే చీరను ఎలా తయారు చేశారు?:
    సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్... పరిమళించే పట్టుచీరను ఆవిష్కరించాడు. పరిమళించే పట్టు చీర ధర రూ. 12 వేలుగా నిర్ణయించినట్లు తెలిపాడు. దీనిని తయారు చేయడానికి వారం రోజుల సమయం పట్టిందని విజయ్ వివరించాడు. 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపిన ద్రావణంలో పట్టు పోగులను ఉడకబెట్టి... పవర్ లూమ్ (power loom)పై పట్టు చీరను నేశాడు. సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. ఈ పట్టు చీర ఐదున్నర మీటర్ల పొడవు, 46 ఇంచుల వెడల్పు, 400 గ్రాముల బరువుంది. 7 రోజుల పాటు శ్రమించి చీర నేసినట్లు విజయ్ తెలిపాడు.

    సుగంధం తయారీకి వాడిన ముడి పదార్ధాలు:
    శ్రీగంధం అనేది 27 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన శక్తివంతమైన గంధం. ఈ గంధం తయారీకి వాడే ముడిపదార్ధాలు... శ్రీగంధం, నాగకేసరాలు-బిల్వ గుజ్జు, బట్టి వేర్లు, ఎలాచి, గులాబీ రేకులు, జటమాంస, బావంచాలు, కుంకుమపువ్వు, ఎర్రచందనం, దేవదారు, పచ్చ కర్పూరం, కోస్టం, తుంగ దుంపలు, కస్తూరి పసుపు, పాల సుగంది, జాపత్రి జాజికాయ, జవ్వాజి, కురువేళ్ళు, వస, సంపంగి, విరజాజి, కృష్ణ తులసి, గంధ కచోరాలు, లాల సపత్రి వంటి పలు రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి శ్రీగంధం తయారు చేశారు.



    చేనేత కళాకారుడు నల్ల పరంధాములు కుమారుడైన నల్ల విజయ్ కుమార్... తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు. 1987లోనే అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారుచేసి సిరిసిల్ల ఖ్యాతిని దేశం నలుమూలల చాటిన ఘనత పరంధాములుది. అట్లాంట ఒలంపిక్‌లో 112 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించి రికార్డుకెక్కినట్లు విజయ్ తెలిపాడు. మూడు కొంగుల చీరలను సైతం తయారు చేసి అందరి మన్ననలను పొందాడు. ఉంగరంలో, దబ్బానం రంద్రంలో దూరే చీరలను సైతం తయారు చేసినట్లు వివరించాడు. కుట్టు లేని లాల్చి-పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు.

    కరీంనగర్ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం చేనేత కళాకారుడిని సన్మానించి అభినందించారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే చేనేతలో మరిన్ని కళారూపాలను ఆవిష్కరిస్తానని చెబుతున్నాడు నల్ల విజయ్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పలు అవార్డులు అందుకున్నట్లు వివరించాడు. ఎవరికైనా పట్టు చీరలు కావాలంటే నాణ్యమైన చీరలను తయారు చేసి ఇస్తానని పేర్కొన్నాడు. సెల్ నెంబర్: నల్ల విజయ్ +91-9866929019

    Read this: Mulugu: 20 ఏళ్ల పాటు సరిహద్దు వద్ద కాపలా కాసిన సైనికుడు: ఊరుఊరంతా వచ్చి ఘన స్వాగతం
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు