సర్పంచ్ కట్టుకోమన్నాడని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామని.. అధికారులు కట్టుకున్న ఇంటిని కూల్చివేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరి గ్రామపంచాయతీ సర్పంచ్ అక్రమార్జనకు పేద కుటుంబం వీధిన పడిందనే చెప్పాలి.
నివాస స్థలాలు లేని, చదువురాని అమాయకులను, పేదలను టార్గెట్ చేసుకొని, చంద్రగిరి గ్రామపంచాయతీ పరిధిలోగల ప్రభుత్వ, శిఖం భూముల్లో ఇళ్ల స్థలాలు చూపిస్తూ.. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తిరిగి ఆ స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలు చేయడానికి పర్మిషన్ ఇప్పిస్తానంటూ.. లక్షల రూపాయలు వసూలు చేసి, కాలయాపన చేస్తూ.. తన పబ్బం గడుపుకుంటున్నాడు.
తాజాగా శివరాత్రి సుశీల అనే మహిళకు కూడా ఇల్లు పర్మిషన్ ఇప్పిస్తానని లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఆ మహిళ ఆ స్థలంలో గృహ నిర్మాణం చేపట్టింది. అయితే ఆ స్థలం చెరువు శిఖం కావడంతో, అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటి నిర్మాణాన్ని జేసీబీతో కూల్చివేశారని బాధిత మహిళ పేర్కొంది. ఆరుకాలం శ్రమించి రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడంతో గుండెలు పగిలేలా కుటుంబ సభ్యులు రోదించారు.
సర్పంచ్ రాజేష్ లక్ష రూపాయలు తీసుకుని ఇల్లు కట్టుకోమని చెప్పడంతో తాము ఇంటి నిర్మాణం చేపట్టామని, సర్పంచ్ దగ్గరుండి ఇంటి నిర్మాణాన్ని చేయించాడని, ఏ అధికారి వచ్చినా తాను మాట్లాడతానని చెప్పాడని వివరించారు. అయితే, ఈ రోజు ఇలా చేయడం ఏంటని బాధితులు వాపోయారు. సర్పంచ్ దుర్బుద్ధి కారణంగా 10 లక్షల రూపాయలు నష్టపోయామని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ స్పందించి సర్పంచ్ వద్దనుండి నష్టపరిహారాన్ని ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే తెట్టకుంటలో బీడీ కార్మికులకు కేటాయించగా మిగిలిన స్థలాలను, చంద్రగిరి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ, శిఖం భూములను సర్పంచ్ కబ్జాలు చేస్తూ.. ఆ స్థలాలను ప్లాట్లుగా విభజించి, అమాయక ప్రజలకు అంటగడుతూ కోట్ల రూపాయలు కొల్ల గొడుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు అండగా ఉంటూ.. అభివృద్ధి పనులు చేయాల్సింది పోయి.. నిరుపేద కుటుంబాల జీవితాలతో ఆడుకోవడం ఏంటనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.
అక్రమ నిర్మాణం కూల్చివేత..
వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో అనుమతులు లేకుండా, చెరువు శిఖాన్ని ఆక్రమించుకుని నిర్మించిన భవనాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూల్చివేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. తెట్టెకుంటలోని సర్వే నెంబర్ 5లో చేపట్టిన అనుమతిలేని నిర్మాణాన్ని ముందే గుర్తించి పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ యజమాని పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగించారని తెలిపారు.
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఈ నిర్మాణం శిఖం పరిధిలోకి వస్తుందని నిర్దారించి తొలగింపునకు ఆదేశించారని వివరించారు. దీంతో శనివారం మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించారన్నారు.
గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు..
సరైన అనుమతులు లేకుండా గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోరారు. ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాల విషయంలో సంబంధిత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.
ఆన్లైన్లో నిర్మాణ అనుమతులు..
ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్లో అందిస్తున్నామని తెలిపారు. నిర్మాణదారులు స్వయంగా గాని మీసేవ కేంద్రాల్లో గాని సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, నివాసగృహాలకు 15 రోజుల్లో, నివాసేతర నిర్మాణాలకు 30 రోజుల్లో ఆన్లైన్ లోనే అనుమతి పత్రాలు జారీ చేస్తారని ఆయన వివరించారు. అనుమతుల జారీలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత మండల పంచాయతీ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Telangana