Revanth Reddy Convoy Accident | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ధాటికి బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి కార్లు ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో 4 కార్లు కాన్వాయ్ లోని వాహనాలు కాగా మరో రెండు కార్లు రిపోర్టర్స్ కి సంబంధించినవి. ఇందులో సిరిసిల్ల రిపోర్టర్స్ ఉండగా.. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తుంది.
ఇక ప్రమాదానికి గురైన కార్లను రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక రిపోర్టర్ల కార్లు ధ్వంసం అవ్వడంతో వారు తమ ఆవేదనను రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి చెప్పుకున్నారు.
కాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) గత కొన్నిరోజులుగా హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. మేడారం సమ్మక్క సారలక్క నుంచి మొదలైన ఈ పాదయాత్ర మహబూబాబాద్ , వరంగల్ పూర్తి చేసుకొని ఉమ్మడి కరీంనగర్ లో అడుగుపెట్టింది. ఈ యాత్రలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతుంది. ఈ క్రమంలో రామన్నపేటకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెళ్తుండగా ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి ఆరు కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే సరైన సమయంలో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Sircilla, Telangana