రిపోర్టర్ : హరి
లొకేషన్ : సిరిసిల్ల
గర్భిణీ స్త్రీల నమోదు, సాధారణ ప్రసావాలపై ఆరోగ్య సిబ్బంది దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఆయన చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, వైద్యారోగ్య శాఖ పథకాల అమలు తీరుపై అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు ఎలాంటి అనారోగ్యం కలిగినా సంబంధిత ఆశా, ఏఎన్ఎంలు వెంటనే స్పందించి మెరుగైన వైద్యసేవలు అందించేలా చూడాలని అన్నారు.
గర్భిణీలు రక్తహీనత సమస్యను ఆదిలోనే గుర్తించి డెలివరీ అయ్యే సమయానికి సుఖప్రసవం అయ్యేవిధంగా ఏఎన్‌ఎంలు ఆశా వర్కర్లతో పాటు మెడికల్ ఆఫీసర్ పకడ్బందీగా బర్త్ ప్లాన్ చేయాలని సూచించారు. క్షయ వ్యాధి ఉన్న వారిని గుర్తించి వారికి వెంటనే తగిన మెడిసిన్ అందించాలని, వ్యాధి నివారణపై సమీక్షిస్తూ రోగులకు పౌష్టికాహారానికి ప్రతి నెలా ఇచ్చే 500 రూపాయల ఆర్థిక సహాయం క్షయ బాధితులకు అందేలా చూడాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు ఎప్పటికప్పుడుశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. గురువారం నుండి ప్రారంభమయ్యే కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలో అన్ని రకాల సౌకర్యాలతో పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఉందని, ఏరియా ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నార్మల్ డెలివరీలపై వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ రేగులపాటి మహేష్ రావు, పిల్లల వైద్యులు సంతోష్, వి.దీప్తిలు గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ ల పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీని ఫలితంగానే నార్మల్ డెలివరీల సంఖ్య రోజుకి ఏరియా ఆసుపత్రిలో పెరుగుతుందనే చెప్పాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.రజిత, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డా.శ్రీరాములు, మెడికల్ ఆఫీసర్ డా.సంపత్, డీడీఎం కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana