హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం!

Rajanna Siricilla: వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం!

ఘనంగా స్వామివారి ఉత్సవాలు

ఘనంగా స్వామివారి ఉత్సవాలు

RajannaSiricilla: దక్షిణకాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్నవేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

దక్షిణకాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్నవేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉదయం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పుణ్యహవచనం, మండప ప్రవేశం, ప్రధాన కలశ దేవతా ప్రతిష్ఠాపన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి 11 మంది ఋత్విజులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి దుర్గాసూక్త లలితా సహస్రనామార్చన, శ్రీ లక్ష్మీఅనంతపద్మనాభస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి వారాలకు పంచో ఉపనిషత్తుల ద్వారా అభిషేకాలను శాస్త్రోక్తంగా చేశారు. నాగిరెడ్డి మండపంలో గీతా హోమం నిర్వహించారు.

ప్రతిరోజు వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వార్లను భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో దర్శించుకుని సేవలో తరిస్తున్నారు. మూడు రోజులపాటు గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ప్రధానార్చకులు అప్పాల భీమాశంకర శర్మ తెలిపారు. గీతా పారాయణం, పూజా కార్యక్రమాల్లో సంస్కృత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అర్చకులు మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేక పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పరివార దేవతలకు అభిషేక అర్చన పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు. మూడు రోజులపాటు విశేష పూజలు నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేదల పెన్నిధిగా, హరిహర క్షేత్రంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధి.. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

ధర్మ దర్శనంలో భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ అధికారులు క్యూ లైన్ ల వద్ద మంచినీటిని ఏర్పాటు చేశారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కలు చెల్లించుకుని సేవలో తరించారు భక్తులు. మహిళా భక్తులు కుంకుమార్చన పూజ కార్యక్రమాలతోపాటు శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాల నైవేద్యాలు సమర్పించుకున్నారు. తమ ఇంటిల్లిపాదిని పిల్లాపాపలను చల్లగా చూడు రాజన్న తండ్రి అంటూ భక్తులు వేడుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనాల నైవేద్యాలతో పాటు పసుపు కుంకుమలను సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు