K.Haribabu,News18, Rajanna siricilla
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి భక్తులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 34 నెలల తర్వాత ఆలయ ధర్మ గుండం పునః పారంభించినట్లు ఆలయ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీ ఆదివారం ధర్మ గుండాన్ని పునః ప్రారంభించారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి దర్శించుకోవడం ఆనవాయితీ కాగా.. కరోనా నేపథ్యంలో 34నెలలు ఆలయ ధర్మ గుండాన్ని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయశాఖ ఆదేశాల మేరకు రాజన్న ఆలయ అధికారులు మూసివేసిన విషయం మనందరికీ తెలిసిందే.
దీనిపై గతంలో న్యూస్ 18... రాజన్న ఆలయ ధర్మ గుండానికి మోక్షం ఎప్పుడు!?.. సహనం కోల్పోతున్న భక్తులు అనే కథనాన్ని ప్రచురించింది. దీనికి తోడు వేములవాడ పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, బిజెపి నాయకులు సైతం ఆలయం ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాల అందజేసి ధర్మ గుండాన్ని భక్తులకు వినియోగంలోకి తేవాలని కోరారు.
అన్ని ఆలయాల్లో పుణ్య స్థానాలు ఆచరించేందుకు అనుమతులు ఇచ్చినా కూడా, వేములవాడ రాజన్న ఆలయంలో ధర్మ గుండాన్ని ఎందుకు భక్తులకు వినియోగంలోకి తేవడం లేదంటూ భక్తులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనాప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు ధర్మగుండాన్ని ఆదివారం ప్రారంభించినట్టు ప్రకటించడంతో రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ 18 తో ఆలయ ఈవో బ్రహ్మన్న గారి శ్రీనివాస్ మాట్లాడుతూ... రెండు మూడు రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఫైర్ స్టేషన్ సిబ్బందితో సైతం ధర్మ గుండాన్ని శుభ్రం చేసినట్టు తెలిపాడు. ఆదివారం ఆలయ అర్చకులు చేత శాస్త్రోక్తంగా ఆలయ ధర్మగుండం పునః ప్రారంభానికి సంబంధించిన పూజ చేసినట్లు పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం, పేదల పెన్నిధి, హరిహర క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. సోమవారం స్వామి వారి కష్టమైన రోజు కావడంతో స్వామివారిని సోమవారం దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కోడె మొక్కు పూజలు రాజన్న ఆలయ విశిష్టతనే చెప్పాలి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని, కోడె మొక్కులతో రాజన్న ఖజానాకు అధిక మొత్తంలో ఆదాయం వస్తుందని చెబుతున్నారు భక్తులు.. రాజన్న ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వ రోగాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana