K.Haribabu,News18, Rajanna siricilla
రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి భవనం మరమ్మతు పనులకు మోక్షం లభించడం లేదనే చెప్పాలి. భవనం శిథిలావస్థకు చేరడంతో మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయి. రోజులు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రంలోని 33 గ్రామపంచాయతీలకు ఉన్న ఏకైక ఆస్పత్రి ఇది. నిత్యం 80 మంది వరకు పేషెంట్స్ వస్తుంటారు. సిబ్బందికి క్వార్టర్స్ లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వర్షకాలం వచ్చిందంటే సిబ్బంది ఇబ్బందులు చెప్పలేము.
ఆపరేషన్ థియేటర్ సైతం బాగా లేకపోవడంతో ప్రసూతికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని ప్రజలు చెబుతున్నారు. గత వర్షాకాలంలో పెద్ద ఎత్తున చీమలు ఆస్పత్రిలోకి రావడంతో విషయం ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి వెళ్లింది. ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుందనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం మరమ్మతు కోసం రూ.కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంత వరకు పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఉన్నత స్థాయి అధికారులు స్పందించాలనికోరుతున్నారు స్థానిక ప్రజలు.
కదలని అద్దె భవనం ప్రతిపాదనలు:-
ప్రభుత్వాస్పత్రి శిథిలావస్థకు చేరడంతో మరమ్మతు పనులు.. పూర్తయ్యే వరకు అద్దె భవనంలో కొనసాగించాలనే ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. ఆస్పత్రిలోకి పాములు వస్తున్నాయని సిబ్బంది మెరపెట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మరమ్మతు జరిగే వరకు వసతులు ఉన్న అద్దె భవనం బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
త్వరలో మరమ్మతు పనులు:-MPP వటూరి వెంకటరమణారెడ్డి
ప్రభుత్వాస్పత్రి మరమ్మతు పనులు త్వరలో ప్రారంభం అవుతాయి. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక కారణాలతో కొంత ఆలస్యం జరిగింది. ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆస్పత్రి మరమ్మతు పనుల కోసం ప్రత్యేక చొరవతీసుకొని నిధులు మంజూరు చేయించారు.
పేదల వైద్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం:నాగసముద్రాల సంతోష్, (ఇల్లంతకుంట)
వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.పేదల వైద్యంపై మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. ఆస్పత్రి స్థాయి పెంచుతామని మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదని అన్నారు. నిధులు మంజూరయ్యాయని మాత్రం నాయకులు క్షీరాభిషేకాలు చేశారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మంత్రి KTR ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలోని మండల కేంద్రానికి సంబంధించిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో భవనంలో సౌకర్య లేమితో పాటు శిధిలావస్థకు చేరుకుందని, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పనులు ప్రారంభం అయ్యేవిధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు మేలు చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana