Haribabu, News18, Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లోవచ్చే జనవరి 15వ తేదీలోగా రెండు పడక గదుల ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అన్ని మండలాల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల తహశీల్దార్లు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చూడాలని అన్నారు. వచ్చే జనవరి 15 కల్లా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేసి, అట్టి జాబితాను గ్రామ పంచాయితీ నోటీస్ బోర్డ్ లో అతికించాలని, ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని పునః పరిశీలించాలని అన్నారు.
ధరణి, కోర్టు కేసులు, మీసేవ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ లో ఉంచితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు సంబంధించి హార్డ్ కాపీలు ఇంకా పూర్తిగా అందలేదని, సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించాలని తహశీల్దార్లను ఆదేశించారు.
జిల్లాలో ఈరోజు వరకు 1 లక్షా 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇంకా 70 - 80 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉంది కలెక్టర్ తెలిపారు. తహశీల్దార్లు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి గంగయ్య, పర్యవేక్షకులు శ్రీకాంత్, రాంరెడ్డి, సుజాత,వేణు, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana