రిపోర్టర్ : హరి
లొకేషన్ : రాజన్న సిరిసిల్ల
అమ్మ ట్రస్ట్ ముసుగులో అమాయకులను బురిడీ కొట్టించిన అంతర్ రాష్ట్ర సైబర్ చీటర్ ను వేములవాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా నూజివీడుకు చెందిన జలం పవన్ చైతన్య (27) అక్కడి ఓ ఆటో కన్సల్టెన్సీలో ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అమ్మ ట్రస్ట్ నిర్వహిస్తున్నానంటూ నమ్మించి పలువురిని మోసం చేశాడు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన వేముల రాజశేఖర్ 2022 జూలై 18న తన తల్లి దవాఖానలో చికిత్స పొందుతుందని ఆర్థిక సహాయం చేయాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇది చూసిన పవన్ చైతన్య రాజశేఖర్ కు ఫోన్ చేసి, చికిత్స కోసం అమ్మ ట్రస్టు పేరిట రూ.4 లక్షలు అందిస్తానని, ఇందుకు కొంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నమ్మించాడు.
దీంతో రాజశేఖర్ (Google pay) గూగుల్ పే ద్వారా రూ.14 వేలను చైతన్యకు పంపించాడు. ఆ వెంటనే చైతన్య రాజశేఖర్ మొబైల్ నంబర్ బ్లాక్ చేశాడు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయగా..దర్యాప్తులో భాగంగా నిందితుడి బ్యాంకు ఖాతా పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, సీడీఆర్ విశ్లేషణ ద్వారా నూజివీడులో ఉన్నాడని పక్కగా సమాచారం తెలుసుకున్నారు వేములవాడ రూరల్ పోలీసులు. బన్సీలాల్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం అక్కడకు వెళ్లి పవన్ చైతన్యను పట్టుకున్నారు. అతని నుంచి రూ.14 వేల నగదు, 2 బ్యాంకు పాస్ పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వపన్ చైతన్య తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, సైబరాబాద్ లోని బాచుపల్లి, హైదరాబాద్ లోని బోయినపల్లి, ఖమ్మం, యర్రుపాలెం, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం , పెనుగొండలో ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించారు. ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ కాల్స్ వస్తే ఎలాంటి బ్యాంకు ఖాతా వివరాలు కానీ, ఆధార్ కార్డు సమాచారం కానీ ఇవ్వకూడదని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త, సైబర్ నేరానికి గురైతే వెంటనే చేయవల్సిన ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930, లేదా NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. డబ్బులు పోయాక బాధపడటం కంటే అవగాహనతో వ్యవహరించి ముందే జాగ్రత్త పడటం ఉత్తమమం.
సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:-
1. మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ? ఆశపడకండి, అనుమానించండి.
2. లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
3. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకండి. చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి.. మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
4. వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.
5. తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయండి.
6. మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళని గ్రహించండి.
7. "ఇన్స్టా గ్రామ్"లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండి, మోసపోకండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Local News, Sircilla, Telangana, Telangana crime news