Haribabu, News18, Rajanna Sircilla
ఆలయాల్లోని కోనేటిలో స్నానం చేసి.. శరీర శుద్ధి అనంతరం భగవంతుణ్ణి వేడుకుంటారు హిందువులు. అందుకే దాదాపు భారతదేశం (India)లోని అన్ని ప్రధాన ఆలయాల్లో కోనేరు ఉంటుంది. అయితే కాలక్రమేణా నిర్వహణ లోపం, అధికారుల అలసత్వం కారణంగా ఈ కోనేరులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. దక్షిణకాశీగా తెలంగాణ (Telangana) లోని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ధర్మగుండం మూతపడి రెండేళ్లు గడుస్తోంది. కరోనా(Covid) కారణంగా 2 సంవత్సరాల క్రితం రాజన్న ధర్మగుండాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మగుండం (కోనేరు) మూసి ఉండడమే కాకుండా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచీ, ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తులు ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే కరోనా వ్యాప్తి నిర్ములనలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2020 మార్చి 20 తేదీన ఆలయ అధికారులు ధర్మగుండాన్ని మూసివేశారు. అప్పటి నుంచి భక్తులకు ధర్మగుండంలో పుణ్య స్నానాలకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే కోనేటిని అవసరం మేరకు తెరిచి పూజల అనంతరం మళ్లీ మూసివేస్తున్నారు.
ఇక ధర్మగుండం మూసివేయడంపై రాజన్న భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధర్మగుండం పునఃప్రారంభం విషయమై దేవాదాయ శాఖతో పాటు ఆలయ ఈఓకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా వారు పట్టించుకోవడంలేదని హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనేరు మూసి వేయడంతో ఆరు బయట స్నానాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
అసహనానికి గురవుతున్న రాజన్న భక్తులు
ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రాజన్న క్షేత్రానికి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో కోనేరులను తెరిచినా రాజన్న ఆలయంలో మాత్రం ఇంకా మూసివేయడంపై భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఇక్కడి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. రోగాలు సైతం నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల మనోభావాలు కాపాడేలా రాష్ట్ర దేవాదాయ శాఖ చర్యలు తీసుకొని వెంటనే రాజన్న ధర్మగుండాన్ని తిరిగి ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు ధర్మగుండాన్ని ప్రారంభించాలని దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినా ఆలయ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈవో రమాదేవి ప్రత్యేక చొరవ తీసుకొని ధర్మగుండం పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana