Haribabu, News18, Rajanna Sircilla
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని ప్రకటన చెయ్యడంతో గంపెడు ఆశతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి పింఛన్ పొందడం మూడు రోజుల ముచ్చటగా మారిందనే చెప్పాలి. పించన్ ఇచ్చినట్లే ఇచ్చి మూడు రోజులకే తిరిగి తీసుకున్నారు. పింఛన్ మంజూరు చేశామని ఎంతో ఆర్భాటంగా అర్హులైన వారికి ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేసి, వారిని జాబితా నుంచి తొలగించామని చెప్పడంతో ఆ వృద్ధుల ఆవేదన అరణ్యరోధనగా మిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో ఇలాంటి వారి సంఖ్య చాలానే ఉంది. మలిదశలో తమ అసరాలకు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ ఆసరా అవుతుందని ఆశతో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం మొండి చెయ్యి ఇచ్చింది.
ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి పింఛన్ పొందేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ.. మీసేవల చుట్టూ ప్రదిక్షిణలు చేసి, తీరా అనరా పింఛన్ మంజూరు చేసుకుంటే, పింఛన్ డబ్బులు తీసుకునే సమయానికి నిరాశే మిగిల్చారు. ఎన్నో రోజులుగా ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధుల ఆశలు ఆవిరి అయ్యాయి. కోనరావుపేట మండలంలో కొత్తగా పింఛన్ లు 1500లు మంజూరు కాగా, అందులో చనిపోయిన వారివి 107, అనర్హులుగా 75 గుర్తించినవి ఉన్నాయి.
కేవలం 1318 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేశారు. పాత పింఛన్లు మండలంలో వృద్ధాప్య పింఛనులు రూ.2016 చొప్పున 2951 మందికి, వికలాంగుల పింఛన్లు రూ.3016 చొప్పున 1023 మందికి. వితంతు పింఛనులు రూ.2016 చొప్పున 1930 మందికి, చేనేత కార్మికులకు పింఛనులు రూ. 2016 చొప్పున 71 మందికి, గీతా కార్మికులకు రూ.2016 చొప్పున 204 మందికి, ఒంటరి మహిళలకు పింఛనులు రూ.2016 చొప్పున 88 మందికి, బీడి కార్మికుల పింఛనులు రూ.2016 చొప్పున 3226 మందికి అందజేస్తున్నారు. మండలంలో మొత్తం 9688 మంది ఆసరా పింఛన్ దారులకు రూ.2,05,54,008 ప్రతి నెల వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. కాగా 2018 సార్వత్రిక ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛనులు ఇచ్చేందుకు లబ్ధిదారులను గుర్తించింది.
కాగా మండలంలో ఎంతో ఆర్భాటంగా ఆసరా కార్డులను పంపిణీ చేసినప్పటికి, అనర్హులుగా గుర్తించిన వారికి కార్లు, భారీ వాహనాలు, విలువ గల ప్లాట్లు భూములు రిజిస్ట్రేషన్ ఉన్నాయని కుంటి సాకులు చెబుతున్నారు. తమకు పింఛన్ మంజూరైందని ఎంతో ఆశతో ఉన్న వృద్ధులకు ఒక్కసారిగా పింఛన్ డబ్బులు రాకపోవడంతో తిరిగి ఆఫీస్ల చుట్టూ, ప్రజా ప్రతినిధులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. పింఛన్ రద్దు చేసిన వారికి అధికారులు సాకులు చెప్పడంతో అలాంటివి లేవని, తమకు వాటితో ఏమి సంబంధం లేదని ఎంత చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారు.
ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా ఇలాంటి కుంటి సాకులు చెబుతూ పింఛన్లను తొలగిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రద్దు చేసిన ఫించన్లకు తిరిగి సర్వే చేసి, అందులో అర్హులు ఉన్నవారికి తిరిగి పింఛన్ అందించేలా ఇప్పటి వరకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. కావాలనే కొన్ని పించన్లు ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పండుటాకుల ఆశలు ఆవిరి కాకుండా.. తిరిగి సమగ్ర విచారణ చేసి అర్హులందరికి పింఛన్లు అందజేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana