Haribabu, News18, Rajanna Sircilla
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం (Harithaharam) కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారడానికి ఎండిపోయిన మొక్కలే నిదర్శనం అని చెప్పాలి. హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో నాటిన మొక్కలకు పర్యవేక్షణ లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన అధికారులే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వేములవాడ పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ సంబంధిత అధికారులు స్పందించి హరితహారం మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ మండల కేంద్రాల్లో రోడ్లకు ఇరువైపులా, మండల పరిషత్ ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిన మొక్కలు సైతం ఎండిపోయి దర్శనమిస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి ఏమాత్రం వారిపై పర్యవేక్షణ ఉందో!?
నేడు నాటిన మొక్కలను మనం సంరక్షిస్తేనే అవి వృక్షాలుగా మారి మనకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రాణవాయువును అందిస్తాయని, మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత సైతం తీసుకోవాలని, వాటి రక్షణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ శివారులోని నంది కమాన్ నుంచి 100 పడకల ఆసుపత్రి వరకు రోడ్డుకి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు ఎండి పోయి దర్శనమిస్తున్నాయని, వెంటనే వాటికి సరైన సమయాల్లో నీటిని పోసి రక్షణ జాలిలు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు, ప్రయాణికులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని మార్కెట్ యార్డులో సుమారు 1000 చెట్లకు పైగా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వాటిని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ వెంటనే స్పందించి రోడ్లకు నాటిన హరితహారం మొక్కలతో పాటు మార్కెట్ యార్డులో పర్యవేక్షణ లేకుండా ఉంచిన మొక్కలను కేంద్ర స్థాయిలో పరిశీలించి వాటిని సంరక్షించాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.
బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జింక అనిల్ కుమార్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో, పల్లెల్లో మున్సిపాలిటీల్లో నాటిన హరితహారం మొక్కలపై పర్యవేక్షణ ఏ మాత్రం లేదని, రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా హరితహారం మొక్కలు అన్ని ధ్వంసమై ఎండిపోయి దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. హరితహారం మొక్కల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు హరితహారం మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని సంరక్షించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haritha haram, Local News, Siricilla, Telangana, Vemulawada