రిపోర్టర్ : హరి
లొకేషన్ : సిరిసిల్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం సిరిసిల్ల పట్టణం 35 వార్డ్ పిఎస్ నగర్ ప్రాధమికోన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండో విడత తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం వేడుకగా జరిగింది.
జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, కంటి వెలుగు కార్యక్రమo అధికారి డాక్టర్ శ్రీరాములు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ విజయ్ కుమార్, పలువురు కౌన్సిలర్ ల తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కంటి వెలుగు కార్యక్రమం సజావుగా చేపట్టేందుకు వైద్యులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే వారి వివరాల నమోదు, పరీక్షల నిర్వహణ అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కంటిచూపు కోసం ఇంతటి భారీ కార్యక్రమం ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరూ చేపట్టలేదని అన్నారు. గురువారం నుంచి ప్రారంభమైన అయ్యే ఈ కార్యక్రమం వంద పని దినాల పాటు జిల్లాలో జరుగుతుందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 255 గ్రామాలు, వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలోని 67 వార్డులలో మొత్తం 322 హాబిటేషన్ లలో కంటి వెలుగు కార్యక్రమం కింద ముందస్తు షెడ్యూలు ప్రకారం పేజీల వారిగా శిబిరాలు ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు పైబడిన 4 లక్షల 22 వేల 182 మందికి కంటి పరీక్షలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఒక్కో కంటి వెలుగు శిబిరంలో 1 -వైద్యాధికారి, 1- ఆప్తో మెట్రిస్ట్, 1- డాటా ఎంట్రీ ఆపరేటరు, 2- ఆరోగ్య కార్యకర్తలు(ANM), 1- హెల్త్ సూపర్వైజర్,3- ఆశా కార్యకర్తలు ఉంటారని జిల్లా కలెక్టర్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 21 కంటి వెలుగు టీమ్ లు, సిరిసిల్ల పట్టణంలో 3, వేములవాడ పట్టణంలో 2 టీమ్ లు పని చేస్తాయని అన్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం దృష్టి లోపాలు అవసరమైనవారికి కళ్లద్దాలు, మందులు అందజేస్తామన్నారు.
ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొప్ప కార్యక్రమం కంటి వెలుగు అని.. ఈ కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పని చేసి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం చక్రపాణి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంధత్వ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమం కంటి వెలుగు అని పేర్కొన్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఏమైనా దృష్టిలోపాలు ఉంటే సవరించుకోవాలన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో కంటి వెలుగు శిబిరాలు సజావుగా జరిగేందుకు మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana