Haribabu, News18, Rajanna Sircilla
పేదల సొంతింటి కలను నిజం చేస్తూ.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించేలా తెలంగాణ ప్రభుత్వం (Telagana Government) సంకల్పించింది. అయితే ఈ సంకల్పాన్ని నీరుగార్చేలా ఇళ్ల నిర్మణం మాత్రం ముందుకు సాగడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla) వేములవాడ పట్టణంలోని బస్ డిపో సమీపంలో నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మణం పూర్తికాకపోవడంపై సర్వత్రా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా నిర్మాణం పూర్తైనా ఇంకా లబ్ధిదారులకు అందించలేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.
వేములవాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు వెనుకబడి పోయాయని?, పేద ప్రజల కష్టాలు మంత్రి కేటీఆర్‌కు, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుకు కనిపించడం లేదా? అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేష్ ప్రశ్నించారు. వేములవాడ పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను స్థానిక బీజేపీ నేతలతో కలిసి మహేష్ పరిశీలించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గమైన సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసి, వేములవాడపై ఎందుకు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. చుట్టపు చూపుగా వేములవాడకు వస్తున్న శాసనసభ్యులు రమేష్ బాబు.., జర్మనీలో ఉంటూ నియోజకవర్గ ప్రజల కష్టాలను గాలికి వదిలేసారని మహేష్ విమర్శించారు. నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా దానిపై కనీసం దృష్టి సారించలేని స్థితిలో శాసనసభ్యులు కాలం వెళ్లదీస్తుండడం వేములవాడ నియోజకవర్గ ప్రజల దురదృష్టమని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో బీజేపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
వేములవాడ నియోజకవర్గ పరిధిలో పలు మండలాలు, గ్రామాల పరిధిలో తలపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి కాలేదని ప్రజలు చెబుతున్నారు. వెంటనే ఎమ్మెల్యే రమేష్ బాబు, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి... నిరుపేదలకు అందించి అండగా నిలవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి, ఇంతవరకు నియోజకవర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వకపోవడం శోచనీయమని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పట్టణ శివారులోని ఆర్టీసీ బస్ డిపో సమీపంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. నాణ్యత లోపంతో ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కేటీఆర్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రత్యేక చొరవ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రజలు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Double bedroom houses, Local News, Telangana