పెళ్లి అనగానే.. అందరి కళ్లువిందు భోజనంపైనే ఉంటుంది. పెళ్లిలో ఎలాంటి ఫుడ్స్ పెడుతున్నారు. మెనూ ఏంటి ? నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇలా రుచికరమైన భోజనం చేసేందుకు అతిథులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే చాలామంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఏపీలో సాధారణంగా పెళ్లిళ్లలో నాన్ వెజ్ వంటలు వడ్డించారు. కానీ తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి పెద్ద పీట వేస్తారు.
కానీ సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. మాత్రమే వడ్డిస్తారు. అయితే ఇప్పుడే మొదలైన విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్‌నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు.
1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలు పెళ్లిలో శాకా హారం మాత్రమే వడ్డించాలని తీర్మానం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్‌లోని ఓ పెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతోపెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు.
ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి, మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్‌లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana