రిపోర్టర్ : హరి
లొకేషన్ : సిరిసిల్ల
మంత్రి కేటీఆర్ మాట ఇచ్చి మరిచారని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని ముస్తాఫానగర్ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి యాదవ్ రాజీనామా ప్రత్రాన్ని విడుదల చేశారు. మంత్రి సిరిసిల్ల సొంత ఇలాకాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్పంచు రాజీనామా పత్రం విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.
సర్పంచ్ సంధ్యారాణి యాదవ్ రాజీనామా లేఖలో పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి. కేటీఆర్ మీ మాట నమ్మిన, మీరు ఇచ్చిన మాట ప్రకారం మా ముస్తాఫానగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించానని, అయినా కూడా మా ఊరి అభివృద్ధి విషయంలో భేదాభిప్రాయాలు చూపెట్టడం మూలంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని నేడుగంభీరావుపేటలోనే కేజీ టు పీజీ పాఠశాల ప్రారంభోత్సవం కోసం వచ్చినప్పుడు నేరుగా కలిసి సమర్పిస్తానని, గంభీరావుపేట మండలంలోని ముస్తాఫానగర్ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి యాదవ్ అన్నారు. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై సర్పంచ్ ను స్తభాస్థలికి వెళ్లకుండా, మంత్రిని కలవకుండా గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది.
పెద్దమ్మతల్లి స్టేజీ నుండి లింగన్నపేట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి మరిచారని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోమా గ్రామాన్ని దళితబందు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని గుర్తు చేశారు. నమాజ్ చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని, యాదవులకు సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం కోసం స్థలసేకరణ చేసి వెనక్కి తీసుకున్నారన్నారు. లింగన్నపేట బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామని చెప్పి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు సర్వే చేయకపోవడం సరికాదన్నారు.
ముస్తాఫానగర్ నుండి మాచారెడ్డి చౌరస్తా వరకు డబల్ రోడ్డు చేస్తానని మాట ఇచ్చారని, బట్టల చెరువును రంగనాయక్ సాగర్ తరహాలో టూరిజం స్పాట్ గా మారుస్తానని, నిధుల మంజూరు కాగితాలకు మాత్రమే పరిమితం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండలంలో బస్ డిపో ఏర్పాటు చేస్తానని, నర్మాల ఎగువ మానేర్ ను టూరిజం స్పాట్ గా మారుస్తానని చెప్పారని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి మండల ప్రజలకు డబల్ బెడ్ రూమ్ లు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సర్పంచ్ కొక్కు సంధ్యారాణి యాదవ్ తెలిపారు. మంత్రి సొంత ఇలాకాలో సర్పంచ్ రాజీనామాకు పూనుకోవడం దేనికి సంకేతం అని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అధికార పార్టీ నాయకులు మాట్లాడడం శోచనీయం. ఈ నిర్ణయంతో మంత్రికి సొంత ఇలాకాలోనే షాక్ అనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana