(K.Haribabu,News18, Rajanna siricilla)
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టినట్లు చూపించిన బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అభినందించారు. బలగం సినిమా తాను చూసినట్లు ప్రకటించారు. వేణుని పిలిపించుకొని మరి సిరిసిల్ల కలెక్టరేట్ సముదాయంలో మంత్రి కేటీఆర్ సత్కరించారు. బలగం లాంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో సమాజానికి దోహదపడేలా సినిమాలు తీయాలని ఇప్పుడే కమర్షియల్ చిత్రాల వైపు వెళ్ళొద్దని మంత్రి కేటీఆర్ వేణుకు సూచించారు. మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తారని దీనికి ఉదాహరణ బలగం సినిమాని పేర్కొన్నారు. తాను గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సినిమా ఇంత స్థాయిలో విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గమైన సిరిసిల్ల పట్టణానికి చెందిన వేణు సిరిసిల్ల ఖ్యాతిని బలగం సినిమాతో పెంచాడని ప్రశంసించారు. మంచి సినిమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు సిహెచ్ రమేష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్పీ అఖిల్ మహాజన్, జడ్పీ చైర్పర్సన్ అరుణలు వేణు యెల్దండికి అభినందనలు తెలిపారు.
గతంలో సిరిసిల్ల కూరగాయల మార్కెట్ లో తన తల్లితో కూరగాయలు అమ్మి సినిమాలో నటించాలనే ఆలోచనతో హైదరబాద్ వచ్చి అనేక కష్టనష్టాలకు ఎదుర్కొని అనేక సినిమాల్లో కమెడియన్ గా, జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై కమీడియన్ గా ఎదిగాడు. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్లో బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.
మున్నా సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించడంతో ఆ పాత్ర హైలెట్ అయింది. దీంతో అందులో టిల్లు అనే పేరుతో.. టిల్లు వేణుగా పేరు వచ్చింది అతనికి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో పాటు వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో బలగం సినిమా షూటింగ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్న పలువురు జానపద కళాకారులను నటీనటులకు ఈ సినిమాలో అవకాశం కల్పించి వెండితెరకు పరిచయం చేశాడు వేణు. దీంతో సినిమా హిట్ కావడంతో అందులో నటించిన నటీనటులు అందరూ ప్రశంసలు పొందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balagam Movie, Local News, Rajanna sircilla, Telangana