విద్య కోసం స్కూల్ కి వచ్చిన చిన్నారులను గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాల్సిన హెడ్మాస్టర్.. నేటి బాలలే రేపటి కార్మికులు అనుకున్నాడో ఏమో.. విద్యార్థుల చేత మండుటెండలో ట్రాక్టర్ పై టేబుల్స్ ఎక్కించే పని చేయించాడు. దీని పట్ల విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని వట్టెం గ్రామ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థుల చేత స్కూల్ బెంచీలను ట్రాక్టర్ పైకి ఎక్కించారు. బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఆయనే బడికి వచ్చిన పిల్లలతో డెస్క్ బెంచిలను (బల్లలను) ట్రాక్టర్ పైకి ఎక్కించి వారిని కూలీలుగా వాడిన విధానం చూస్తుంటే భవిష్యత్తులో పిల్లలను బాల కార్మికులుగా చూస్తున్నాడేమో అనే సందేహం కలుగుతుందనే చెబుతున్నాయి.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడిబాట, మన ఊరు-మనబడి కార్యక్రమాల ద్వారా సర్కార్ పాఠశాలలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలకు ఆధునిక ఫర్నిచర్వచ్చింది. దీంతో.. అప్పటివరకు పాఠశాలల్లో ఉపయోగించిన ఫర్నిచర్ ను జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేని పాఠశాలలకు వాటిని తీసుకెళ్లాలని జిల్లా విద్యా శాఖఅధికారులు సూచించారు. ఇంతవరకు బాగానే ఉంది. కూలీల చేత లేదా.. లేదా ఎవరైనా పెద్దవాళ్ల చేత సిరిసిల్ల నుంచి ఫర్నిచర్ తరలించాల్సి ఉండగా.. అది మర్చిపోయిన వట్టెం ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ పాఠశాలలోని పలువురు విద్యార్థులను మండుటెండలో ట్రాక్టర్ పై సిరిసిల్లకు తీసుకువచ్చాడు.
సుమారు 22 కిలోమీటర్ల దూరం నుండి ఎండలో తీసుకురావడమే కాకుండా విద్యార్థుల చేత పనులు చేయించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వాహనంలో వచ్చిన ఫర్నిచర్ ను దించడంలో విద్యార్థుల సహాయ తీసుకోవడంలో తప్పు లేకపోవచ్చు. కానీ బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులను ఇలా మండుటెండలో 22 కిమీ తీసుకొచ్చి చాకిరి చేయించడం ఎంతవరకు సమంజసమో సదరు ప్రధానోపాధ్యాయుడే చెప్పాలి. ఈ విషయంపై హెడ్ మాస్టర్ ను వివరణ కోరగా బడి పనే కదా అనడం శోచనీయం.
ఎండలో ట్రాక్టర్ పై 22 కిలోమీటర్ల ప్రయాణం చేయించి.. బెంచీలను ట్రాక్టర్ పైకి ఎక్కించిన క్రమంలో విద్యార్థులకు ఏమైనా జరిగితే బాధ్యులెవరనేది సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. నీడ పట్టున ఉండేలా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తమ పిల్లలను బడికి పంపిస్తే.. ఉపాధ్యాయులు ఇలా ట్రాక్టర్ ఎక్కించి కూలీలుగా మార్చిన వైనం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి టీచర్స్ వల్లే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, ప్రైవేట్ స్కూల్స్ లో తమ పిల్లలని చేర్పించేలా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే, మంత్రి కేటీఆరే ప్రత్యేక చొరవ తీసుకొని కట్టించిన పాఠశాల నుండి విద్యార్థులతో బెంచీలు మోపించిన హెడ్ మాస్టర్ తీరును పలువురు తప్పుబడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Telangana